Ponnam Prabhakar : కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక, సినిమా వాళ్ల దాడి సరికాదు? -మంత్రి పొన్నం
Minister Ponnam Prabhakar: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల దుమారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. మంత్రి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా? ఇంత దాడి అవసరమా? అని ప్రశ్నించారు. బలహీన వర్గాలకు చెందిన మహిళా మంత్రి ఒంటరి కాదని స్పష్టం చేశారు.
రైతుల పేరుతో బీజేపీ, బీఆర్ఎస్ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఒకటే ఒకరి, తర్వాత ఒకరు ఆందోళన చేస్తున్నారన్నారు. శనివారం హైదరాబాద్ గాంధీభవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 10 నెలల కాంగ్రెస్ పాలన విజయవంతంగా సాగిందన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు అధిగమించి హామీలు నెరవేస్తున్నామన్నారు. వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే కేంద్రం రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.
మంత్రి కొండా సురేఖ విషయంలో సినిమా వాళ్లు సంయమనం పాటించాల్సి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాక సినిమా వాళ్లు స్పందించడం సరికాదన్నారు. మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాక సమస్య ముగిసినట్టే అన్నారు. బలహీనవర్గాల మహిళా మంత్రి ఒంటరి కాదని పొన్నం ప్రభాకర్ అన్నారు. సినిమా వాళ్ల విషయంలో కొంత సంయమనం పాటించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నా కొందరు ఇంకా చర్చను కొనసాగించారన్నారు. కొండా సురేఖను అవమానించేలా పోస్ట్ చేసిన అంశంపై కూడా సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేదని మంత్రి పొన్నం అన్నారు.
మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?
మాజీ మంత్రి కేటీఆర్ ను విమర్శించే క్రమంలో.. మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ కారణమన్నారు. ఈ క్రమంలో హీరో నాగార్జునపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ వ్యక్తులు స్పందించారు. మంత్రి కొండా సురేఖపై మండిపడ్డారు. హీరో నాగార్జున మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ వివాదం పెద్దదవ్వడంతో మంత్రి కొండా సురేఖ... తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయినప్పటికీ ఆమె వ్యాఖ్యలపై సినిమావాళ్లు ఆగ్రహంతోనే ఉన్నారు.
ఇటీవలె హైడ్రా హీరో నాగార్జున భాగస్వామిగా ఉన్న ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేసింది. నాగార్జున కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను పూర్తిగా కూల్చివేసింది. ఈ విషయంపై ప్రభుత్వంపై హీరో నాగార్జున కాస్త అసహనంతో ఉన్నారు. ఇంతలో మంత్రి కొండా సురేఖ హీరో నాగార్జునను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో... ఆయన వెంటనే స్పందించారు. తనకు నష్టం కలిగేలా మాట్లాడారని, కోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు.
ఇదిలా ఉంటే హీరో నాగార్జునకు మరో షాక్ తగిలింది. ఆయనపై హైదరాబాద్ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలోని తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ హీరో నాగార్జునపై ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై లీగల్ ఒపీనియన్ తీసుకున్న మాదాపూర్ పోలీసులు... తాజాగా నాగార్జునపై కేసు నమోదు చేశారు. తుమ్మిడికుంట చెరువు పరిధిలో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను హీరో నాగార్జున నిర్మించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలె ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. ఈ నేపథ్యంలో హీరో నాగార్జునపై కేసు నమోదు కలకలం రేపుతోంది.
సంబంధిత కథనం