Hero Allu Arjun Arrest : జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల - ఇదిగో వీడియో
14 December 2024, 7:29 IST
- Hero Allu Arjun Arrest Updates : చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. శుక్రవారమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ… జైలు నుంచి విడుదల కాలేదు. బెయిల్ పత్రాలు అందే విషయంలో ఆలస్యం కావటమే ఇందుకు కారణమైంది. దీంతో ఇవాళ ఉదయమే ఆయన విడుదలయ్యారు.
హీరో అల్లు అర్జున్
జైలు నుంచి హీరో అల్లు అర్జున్ విడుదలపై శుక్రవారం రాత్రి వరకు సస్పెన్స్ కొనసాగింది. అయితే బెయిల్ పత్రాలు అందే విషయంలో జాప్యం జరగటంతో… రాత్రి అంతా అల్లు అర్జున్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. రాత్రి సమయానికి బెయిల్ పత్రాలు… ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసినప్పటికీ… బన్నీ విడుదల కుదరలేదు.
చంచల్ గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఇవాళ ఉదయమే విడుదలయ్యారు. జైలు వెనక గేటు నుంచి బయటికి వెళ్లారు. నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన… తన నివాసానికి చేరుకోనున్నారు.
ఇక శుక్రవారం రాత్రి అల్లు అర్జున్ మంజీరా బ్యారక్‌లో ఉన్నారు. ఆయన కోసం జైలు సిబ్బంది ఏర్పాట్లు చేశారు. నిన్న రాత్రి వరకు అల్లు అరవింద్ జైలు వద్ద చాాలా సేపు వేచి చూశారు. విడుదలలో జాప్యం జరగటంతో… జైలు వద్ద నుంచి అల్లు అరవింద్ వెళ్లిపోయారు.
నిన్న రాత్రి వరకు అల్లు అర్జున్ అభిమానులు జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. తమ అభిమాన హీరోకి మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే విడుదల కుదరకపోవటంతో నిరాశతో వెనుదిరిగారు.
అల్లు అర్జున్ విడుదల నేపథ్యంలో ఆయన అభిమానులు చంచల్ గూడ జైలు వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. మరోవైపు అల్లు అర్జున్ నివాసం వద్ద కూడా అభిమానుల సందడి ఉంది. దీంతో అక్కడ కూడా పోలీసులు… భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
అల్లు అర్జున్ కేసులో నాంపల్లి కోర్టు రిమాండ్ విధించగా… హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఆలస్యంగా తీర్పు రావటంతో… అప్పటికే అల్లు అర్జున్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. బెయిల్ మంజూరు పత్రాలు అందే విషయంలో ఆలస్యమైంది. లాయర్లు తెచ్చిన బెయిల్ కాపీ సరిగా లేకపోవటం కూడా విడుదలకు ఆలస్యమైంది. దీంతో శుక్రవారం రాత్రి అంతా కూడా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఇవాళ ఉదయమే విడుదల చేశారు.
సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ పై బీఎన్ఎస్ 105, 118(1) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించి.. ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లారు. రిమాండ్ విధించటంతో… జైలుకు తరలించారు.