తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Teachers Transfers : ఆ టీచర్ల చిరకాల వాంఛ నెరవేరబోతోంది.. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలు

TG Teachers Transfers : ఆ టీచర్ల చిరకాల వాంఛ నెరవేరబోతోంది.. 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలు

14 September 2024, 11:58 IST

google News
    • TG Teachers Transfers : వారి నియామకం జరిగి దాదాపు పదేళ్లు గడిచింది. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆ టీచర్లు బదిలీలకు నోచుకోలేదు. అందరి లాగే తమకు బదిలీలకు అవకాశం ఇవ్వాలని ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ (TG School Education)

మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలోని 194 ఆదర్శ పాఠశాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కోరిక త్వరలో నెరవేరనుంది. దాదాపు మూడువేల మంది టీచర్ల చిరకాల వాంఛ ఫలించబోతోంది. ఉద్యోగాల్లో చేరిన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్తర్వుల జారీకి కసరత్తు జరుగుతోంది.

తెలంగాణలోని మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర సిద్ధంచక ముందు 2013లో.. మరోసారి 2014లో రెండు విడతల్లో నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి వారు బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. మూడేళ్లుగా బదిలీలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తెలంగాణ పాఠశాల విద్యాశాఖ గతేడాది జులైలో బదిలీలకు షెడ్యూల్‌ జారీచేసింది. వారంతా వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సర్వీస్‌ పాయింట్ల కేటాయింపుపై కొందరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఫలితంగా బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

సుదీర్ఘ వాదనల తర్వాత తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది. 2013, 2014లో చేరినా.. మెరిట్‌ ప్రకారం సీనియారిటీ జాబితా తయారు చేసి బదిలీలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. ఉద్యోగాల్లో చేరిన తేదీ ఆధారంగా ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు కేటాయించాలని చెప్పింది. ఇటు న్యాయపరమైన ఇబ్బందులు తొలగిపోవడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ బదిలీ ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమైంది.

తెలంగాణలోని పాత జోన్లు (5, 6) ప్రకారమే బదిలీలు జరగనున్నాయని తెలుస్తోంది. ప్రిన్సిపల్స్‌ను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని బదిలీ చేయనున్నారు. పీజీటీ, టీజీటీలకు జోన్‌ యూనిట్‌గా బదిలీలుంటాయని అధికారులు చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తాము బదిలీల కోసం ఎదురుచూశామని.. తమ డిమాండ్‌ను నెరవేరుస్తున్నందుకు ప్రభుత్వానికి మోడల్ స్కూల్ టీచర్లు కృతజ్ఞతలు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం