AP School Holidays : ఎన్టీఆర్ జిల్లాలోని వరద విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు(గురువారం) కూడా ఎన్టీఆర్ జిల్లాలోని పాఠశాలలకు సెలవు ప్రకటించింది. దీంతో వరుసగా ఐదో రోజు కూడా విద్యా సంస్థలు మూతపడనున్నాయి.
మరోవైపు ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటికి పశ్చిమ మధ్య బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫలితంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడుకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి బెజవాడ నగరంలో ఇంకా తేరుకోనే లేదు. ఇంతలోనే మరో అల్పపీడనం హెచ్చరికలు ఉండటంతో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
రేపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.ఈ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వరదలు అల్లకల్లోలం చేశాయి. ఓవైపు భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరగగా… మరోవైపు 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 32 మంది మృతి చెందారని ఏపీ సర్కార్ వెల్లడించింది. ఎన్టీఆర్ జిల్లాలో 24 మంది, గుంటూరు జిల్లాలో ఏడుగురు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందినట్లు తెలిపింది.
వరదల వల్ల 212 పశువులు, 60 వేల కోళ్లు మృతి చెందినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.1,69,370 ఎకరాల్లో పంటతో పాటు 18,424 ఎకరాల్లో ఉద్యాన వన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించింది. ఈ వరదల ఫలితంగా 2 లక్షల 34 వేల మంది రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. 3973 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని సర్కార్ తెలిపింది. 78 చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయని వివరించింది.
మరోవైపు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ఝ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ప్రభుత్వం యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.