AP Employees Transfers : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్... మరోసారి బదిలీల గడువు పొడిగించిన ఏపీ సర్కార్
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీల ప్రక్రియ గడువును మరోసారి పొడిగించింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది.
ఉద్యోగుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీల గడువును మరోసారి పొడిగించింది.సెప్టెంబర్ 22 తేదీ వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 23 తేదీ నుంచి బదిలీలపై నిషేధం వర్తిస్తుందని పేర్కొంది.
ఇక ఎక్సైజ్ శాఖ బదిలీల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది ఏపీ ప్రభుత్వం. అక్టోబర్ 1 తేదీన ఈ శాఖ బదిలీల్లో నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది. తాజాగా ఈ శాఖ పరిధిలోని సెబ్ ను రద్దు చేయటంతో బదిలీలకు ఎక్కువ సమయం కేటాయించారు.
ఏపీ ప్రభుత్వ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఈ బదిలీల గడువు ఆగస్టు 31తో ముగియాల్సి ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. అయితే పలు శాఖల్లో బదిలీలపై ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేదు. దీంతో ఈ గడువు 15 రోజులపాటు పెంచుతూ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది. దీని ప్రకారం… సెప్టెంబర్ 16వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమల్లోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని శాఖల్లో ఇంకా సర్దుబాటు ప్రక్రియ పూర్తి కాకపోవటంతో పాటు ఎక్సైజ్ శాఖలో మార్పులు తీసుకురావటంతో మరోసారి గడువును పొడిగించారు. ఈ గడువు సెప్టెంబర్ 22వ తేదీతో పూర్తి అవుతుంది.
సెబ్ రద్దు చేస్తూ ఉత్తర్వులు:
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(SEB)ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌కు గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్సైజ్ శాఖలో రిపోర్ట్ చేయాలని సెబ్ సిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.
సెబ్ యంత్రాంగం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోవ్యాపారాలు నడిచేలా సహకరించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయని కొత్తగా ఏర్పాటైన ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది. దీంతో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కేబినెట్ భేటీలో చర్చించి… రద్దు నిర్ణయానికి ఆమోదముద్ర వేశారు. ఇందుకు అనుగుణంగా నిన్న ఉత్తర్వులు జారీ అయ్యాయి.
గత ప్రభుత్వ హయాంలో సెబ్ కోసం 4 వేలకుపైగా సిబ్బందిని సెబ్ కు కేటాయించారు. మిగతా వారిని ఎక్సైజ్ శాఖలోనే ఉంచారు. తాజాగా సెబ్ రద్దు కావటంతో… గతంలో ఉన్న మాదిరిగానే ఎక్సైజ్ వ్యవస్థ ఉండనుంది. సెబ్ సిబ్బంది అంతా కూడా పాత విధానంలోనే పని చేయనుంది. వీరంతా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేయనున్నారు.