తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bodhan Ex Mla Son: ప్రజాభవన్ ప్రమాదం కేసులో Brs మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్, ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్…

Bodhan Ex Mla Son: ప్రజాభవన్ ప్రమాదం కేసులో BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడి అరెస్ట్, ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్…

Sarath chandra.B HT Telugu

08 April 2024, 8:43 IST

google News
    • Bodhan Ex Mla Son: ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు షకీల్ అలియాస్ సాహిల్‌ను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. 
శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్ట్

Bodhan Ex Mla Son: మితిమీరిన వేగంతో రోడ్డు ప్రమాదానికి కారణమై, ఆ కేసు నుంచి తప్పించుకోడానికి మరొకర్ని పోలీసులకు అప్పగించి దుబాయ్‌ పరారైన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే Bodhan Ex Mla కుమారుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. మూడు నెలలకు పైగా దుబాయ్‌ Dubaiలో తల దాచుకుంటున్న షకీల్ కుమారుడు రహేల్, గత్యంతరం లేని పరిస్థితుల్లో స్వదేశానికి తిరిగి వచ్చాడు. నిందితుడిపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో విమానాశ్రయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామున శంషాబాద్ విమానాశ్రయం Samshabad Airportలో పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బిఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్ Shakeel కుమారుడు రహేల్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్‌ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహేల్‌పై రోడ్డు ప్రమాదం కేసులు ఉన్నాయి. ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్‌ నిందితుడిగా ఉన్నారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు డిసెంబర్ 23న రోడ్డు ప్రమాదానికి కారణమయ్యాడు. రోడ్డు పమాదం చేసిన తర్వాత నిందితుడు, తన డ్రైవర్‌ను పోలీసులకు అప్పగించి పోలీస్ స్టేషన్‌ నుంచి తప్పించుకున్నాడు.

డిసెంబర్ 23న Prajabhavan వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనలో పంజాగుట్ట పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ సిఐతో పాటు, పంజాగుట్ట మాజీ సిఐ దుర్గారావులు నిందితుడిని తప్పించడానికి సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడి కావడంతో వారిని సస్పెండ్‌ చేశారు. బోధన్ సిఐ ప్రేమ్‌ కుమార్‌ ద్వారా పంజాగుట్ట సిఐ దుర్గారావును ప్రలోభ పెట్టి కేసును తారుమారు చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే నిందితుల్ని పంజాగుట్ట పిఎస్‌కు తరలించారు. ఆ వెంటనే మాజీ ఎమ్మెల్యే అనుచరులతో పాటు బోధన్ సిఐ ప్రేమ్ కుమార్‌ పంజాగుట్ట పోలీసుల్ని ప్రభావితం చేశారు.

నిందితుడిని తప్పించిన వ్యవహారం పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. రహేల్‌ను తప్పించడానికి మాజీ ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న అబ్దుల్‌ను నిందితుడిగా ప్రవేశపెట్టినట్టు స్పష్టమైంది. రహెల్ దుబాయ్ పారిపోవడానికి సిఐలే కారణమని గుర్తించడంతో ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేశారు. ఆ తర్వాత పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్ని మార్చేశారు. నగరంలో కీలకమైన పోలీస్‌ స్టేషన్‌ నుంచి కీలక సమాచారం బయటకు పొక్కుతోందని, స్టేషన్‌ సిబ్బంది మొత్తాన్ని ప్రక్షాళన చేశారు.

ప్రజాభావన్‌ యాక్సిడెంట్ కేసు దర్యాప్తులో ఉండగానే రహేల్ గతంలో కూడా ఓ రోడ్డు ప్రమాదం చేసి ఇదే పద్ధతిలో తప్పించుకున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో రోడ్డుపై బొమ్మలు అమ్ముకునే మహిళకు గాయాలు కావడంతో పాటు చిన్నారి మృతి చెందింది. తాజా కేసు దర్యాప్తులో నిందితుడిగా చూపిన డ్రైవర్‌ అబ్దుల్ అప్పట్లో రహేల్ తరపున పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో పాత కేసును కూడా పోలీసులు తిరగదోడారు.

కేసు బయటపడగానే రహేల్‌ ముంబై మీదు దుబాయ్‌ పారిపోవడంతో పోలీసులు వెంటనే లుకౌట్ నోటీసు జారీ చేశారు. రహేల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్ మీద కూడా కేసు నమోదు చేశారు. తాజాగా నిందితుడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నట్టు అధికారులకు సమాచారం అందడంతో రహేల్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వ్యాసం