తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త -ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!

Yadadri Temple : యాదాద్రి భక్తులకు శుభవార్త -ఇక కొండపై నిద్రించే సౌకర్యం, ఈ రోజు నుంచే అమలు..!

15 March 2024, 16:39 IST

google News
    • Yadadri Temple Latest News: భక్తులకు గుడ్ న్యూస్ చెప్పారు యాదాద్రి ఆలయ అధికారులు. గతంలో మాదిరిగా యాదగిరిగుట్ట కొండపై నిద్రించే సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు ప్రత్యేకంగా డార్మెంటరీ హాల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
యాదాద్రి ఆలయం
యాదాద్రి ఆలయం (https://ytda.in/)

యాదాద్రి ఆలయం

Yadadri Temple News: యాదాద్రి లక్ష్మీనర్సింహ్మా స్వామి(Yadadri Temple) భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో మాదిరిగా కొండపైన భక్తులు నిద్రించే సౌకర్యాన్ని మళ్లీ పునరుద్ధరించింది. ఈ మేరకు కొండపైన ప్రత్యేకంగా డార్మెటరీ హాల్ ను ఏర్పాటు చేసింది. ఇందులో వెయ్యి మందికిపైగా భక్తులు నిద్రించే అవకాశం ఉంటుంది. ఈ డార్మెటరీ హాల్ ను స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇవాళ ప్రారంభించారు. ఇవాళ్టి నుంచే ఈ హాల్ భక్తులకు అందుబాటులోకి రానుందని వైటీడీఏ(YTDA) అధికారులు తెలిపారు.

డార్మెటరీ హాల్ ను ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం… యాదగిరిగుట్టను సమూలంగా మార్చేసింది. 2015లో పునర్ నిర్మాణ పనులను మొదలుపెట్టింది. ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి…. కొత్త నిర్మాణాలను చేపట్టింది. ఈ పనులు 2022లో పూర్తి అయ్యాయి. ఇందులో భాగంగానే ఆలయ పేరును యాదాద్రిగా మార్చారు. గతంలో యాదగిరిగుట్టగా(Yadagirigutta Temple) ఆ ఆలయం ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. పునర్ నిర్మాణానికి ముందు భక్తులు కొండపై నిద్రించే అవకాశం ఉండేది. ఆటోలు కూడా పైకి వెళ్లివి. కొండపై నిద్రించి… స్వామివారికి మొక్కులు చెల్లించుకునేవారు భక్తులు. కానీ పునర్ నిర్మాణ పనుల తర్వాత… కొండపై అనేక మార్పులు చేశారు. నిద్రించే అవకాశం లేకుండా పోయింది. అదే కాకుండా ఆటోలను కూడా నిషేధించారు.

కొండపైకి ఆటోలు…

కొద్దిరోజులుగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత ఆటోలను అనుమతించారు. ఆలయన పునర్ నిర్మాణం తర్వాత… కొండపైకి ఆటోలు వెళ్లకుండా నిషేధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఆటోలు కొండపైకి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీనిచ్చింది. ఇందులో భాగంగా… ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తున్నారు. రోజుకు 100 ఆటోలు షిఫ్టుల వారీగా కొండపైకి నడుస్తున్నాయి. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 11 గంటల వరకు రెండో షిఫ్ట్ ఉంటుంది. షిఫ్టుకు 50 ఆటోలు చొప్పున రాకపోకలు కొనసాగిస్తున్నాయి. 25 ఆటోలు కొండపైన ఉంటే, మరో 25 కొండ కింద ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆటోలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.

యాదాద్రి పేరును తిరిగి యాదగిరిగుట్టగా మార్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

 

తదుపరి వ్యాసం