తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Fish Medicine: రేపే బత్తిని సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తి

Hyd Fish Medicine: రేపే బత్తిని సోదరుల చేప మందు ప్రసాదం పంపిణీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు పూర్తి

Sarath chandra.B HT Telugu

07 June 2024, 13:52 IST

google News
    • Hyd Fish Medicine: చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉబ్బసం రోగులకు స్వస్థత కలిగిస్తుందని భావించే హైదరాబాద్‌ బత్తిని సోదరులు పంపిణీ చేసే ఈ ఔషధానికి పెద్దఎత్తున జనం పోటెత్తనున్నారు.
చేపమందు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
చేపమందు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

చేపమందు ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

Hyd Fish Medicine: ఉబ్బసం, ఆస్త్మా సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో రోగులు స్వీకరించే బత్తిని చేపమందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల నుంచి బత్తిన సోదరుల చేపమందు కోసం హైదరాబాద్ నగరానికి వస్తుంటారు. ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీని బత్తిని కుటుంబం నిర్వహిస్తుంది. ఈ ఏడాది చేపమందు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ‘చేప ప్రసాదం’ కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారు. దీంతో చేప మందు ప్రసాదం పంపిణీ కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ సంఖ్యలో వచ్చే ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని సుమారు 1200 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పోలీస్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్‌ స్క్వాడ్, బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు నిర్వహించారు. మైదానంలోకి వెళ్లే మార్గంలో డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు చేపమందు పంపిణీ రద్దీని దృష్టిలో ఉంచుకుని సంత్‌ నిరంకారీ సత్సంగ్‌కు చెందిన సుమారు 300 మంది కార్యకర్తలు స్వచ్ఛందంగా సేవలు అందించేందుకు ముందుకొచ్చారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ప్రాంగణంలో రెండు అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచారు.

శనివారం ఉదయం నుంచి ప్రారంభించే చేపమందు పంపిణీ కోసం గురువారానికే పెద్ద సంఖ్యలో ఉబ్బసంతో బాధపడుతున్న వారు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి శుక్రవారం మధ్యాహ్నానికి దాదాపు ఆరేడు వేలమంది ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ చేరుకున్నారు. అక్కడి ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటున్నారు. చేపమందు కోసం వచ్చిన వారికి పలు స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీటిని అందిస్తున్నాయి.

ఆరు లక్షల మందికి మందు సిద్ధం…

శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజల తర్వాత చేపమందు పంపిణీ నిర్వహిస్తారు. ఈ ఏడాది దాదాపు ఆరు లక్షల మందికి అవసరమైన మందును సిద్ధం చేశారు. దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబీకుల ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ప్రత్యేక వాహనంలో మందును ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ తరలిస్తారు.

దాదాపు ఆరు లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును ఇప్పటికే తయారు చేసినట్టు బత్తిని అమర్‌నాథ్‌గౌడ్‌ తెలిపారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మందు పంపిణీ చేస్తారు.

ఆ తర్వాత కవాడీగూడ, దూద్‌బౌలిలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తోంది. చేపమందు ప్రసాదం పంపిణీ సందర‌్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ మందు పంపిణీ, ఏర్పాట్లపై ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజల కోసం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. రెండు రోజుల పాటు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ మార్గంలో 130 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది.

ప్రధాన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాండ్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి, శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఆర్టీసీ కల్పిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

తదుపరి వ్యాసం