Fish Medicine:జూన్ 9న నాంపల్లిలో చేప మందు పంపిణీ..మూడేళ్లుగా నిలిచిన చేపమందు పంపిణీ
23 May 2023, 13:40 IST
- Fish Medicine: కరోనా కారణంగా మూడేళ్లుగా నిలిచిపోయిన చేపమందు పంపిణీ ఈ ఏడాది నిర్వహించనున్నారు. జూన్ 9 వ తేదీ ఉదయం 8 గంటల నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ చేపట్టనున్నట్లు బత్తిన బ్రదర్స్ ప్రకటించారు.
చేపమందు పంపిణీపై సమీక్షిస్తున్న మంత్రి తలసాని
Fish Medicine: జూన్ 9 న చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి తలసానితో చేప మందు పంపిణీపై బత్తిన సోదరులు భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తలసాని గుర్తు చేశారు.
చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారని, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. మందు పంపిణీకి అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామన్నారు. మే 25 న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ తేది బత్తిన సోదరులు ఖరారు చేశారు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన అమర్నాథ్ గౌడ్ చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో బత్తిన సోదరులు భేటీ అయ్యారు.
చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని తలసాని బత్తిన సోదరులకు హామీ ఇచ్చారు. ప్రసాదం కోసం వచ్చేవారు నాలుగు గంటల ముందు నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని బత్తిన సోదరులు సూచించారు. ప్రసాదం తీసుకున్న అనంతరం రెండు గంటల పాటు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవద్దని తెలిపారు.
ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన సోదరులు వివరించారు. కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ మూడేళ్లుగా నిలిచిపోయింది. ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ కావడంతో ఈ సారి జనం భారీగా తరలి రానున్నారని అంచనా వేస్తున్నారు.