తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fish Medicine Distribution: హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం

Fish Medicine Distribution: హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ ప్రారంభం

HT Telugu Desk HT Telugu

09 June 2023, 8:14 IST

google News
    • Fish Medicine Distribution: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లో చేపమందు ప్రసాదం పంపిణీ  ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని  ప్రారంభించారు. 
హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభం

హైదరాబాద్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభం

Fish Medicine Distribution: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ ప్రారంభించారు. 170 ఏళ్లుగా హైదరాబాద్‌లో అస్త్మా, ఉబ్బసం రోగులకు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. వివాదాలు, విమర్శలు, శాస్త్రీయతపై రకరకాల వివాదాలు తలెత్తినా దేశంలోని పలు ప్రాంతాల నుంచి చేప ప్రసాదం కోసం ప్రజలు తరలి వస్తున్నారు. ఆస్త్మా, ఉబ్బసంతో బాధపడుతున్న వారికి చేపప్రసాదం స్వస్థత ఇస్తుందని ప్రజలు విశ్వసిస్తారు. బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేపట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రారంభించారు.

చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌ కిక్కిరిసిపోయింది. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గత మూడేళ్లుగా కోవిడ్ కారణంగా చేప ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రసాదం పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది.

కరోనా కారణంగా గత మూడేళ్లుగా చేపమందు ప్రసాదం పంపిణీ కాలేదు. ఏటా ఒక్కసారి మాత్రమే మందు పంపిణీ జరుగుతుంది. నాలుగేళ్ల పాటు మందు తీసుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో ఈఏడాది చేపమందు కోసం భారీగా జనం తరలి వచ్చారు.తెల్లవారు జాము నుంచి క్యూలైన్లు నిండిపోయాయి.ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఒకరోజు ముందే చేపప్రసాదం కోసం తరలి వచ్చారు. వారితో క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు.

చేపమందు కోసం వచ్చే వారి కోసం ప్రవేశ ద్వారం వద్ద 18 క్యూలైన్లను ఏర్పాటుచేశారు. వాటిని ప్రసాదం అందించే ప్రదేశానికి వెళ్లే సరికి 32 కౌంటర్లుగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేశారు. దూద్‌బౌలిలోని బత్తినినివాసం వద్ద కూడా చేపమందు ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

ఐదు లక్షల మంది వస్తారని అంచనా....

తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం మందు కోసం తరలి వచ్చారు. ఎంతమంది వచ్చినా మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు బత్తిన సాయినాథ్ గౌడ్ తెలిపారు.

హైదరాబాద్‌లో ప్రత్యేక బస్సుల ఏర్పాటు....

చేపమందు ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వెళ్లడానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి 130 బస్సుల్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేసన్లతో పాటు ఎంజిబిఎస్‌, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం