TGSRTC : తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త - భారీగా తగ్గిన బస్ పాస్ ధర, వివరాలివే
TGSRTC Latest News : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
TGSRTC Latest News : హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించింది. ప్రయాణించే వారి సౌకర్యార్థం నెలవారీ బస్ పాస్ ధరను తగ్గిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. కేవలం రూ.1900 కే ఈ బస్ పాస్‌ను సంస్థ అందజేస్తున్నట్లు తెలిపింది.
గతంలో ఈ బస్ పాస్ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించింది. ఈ బస్సు పాస్‌తో సికింద్రాబాద్ – పటాన్ చెరువు (219 రూట్), బాచుపల్లి - వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాదు… ఈ బస్‌పాస్‌తో గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులతో పాటు ఈ-మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ప్రయాణించే వెసులుబాటును కల్పించడం జరిగింది. ఎయిర్‌పోర్ట్ మార్గంలో నడిచే పుష్ఫక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదు.
మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలు….
TGSRTC ITI College Admissions : టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్, వరంగల్ లోని టీజీఎస్ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్‌లలో ప్రవేశాలకు ఆసక్తి గల విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది.
అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు https://iti.telangana.gov.in ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సజ్జనార్ సూచించారు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో అడ్మిషన్లు జరుగుతున్నాయని ప్రకటించారు. స్వయం ఉపాధి రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఐటీఐ కోర్సులు వరంలాంటివన్నారు.
నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి తక్కువ వ్యవధిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఐటీఐ కళాశాలలను టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిందని సజ్జనార్ తెలిపారు. నిపుణులైన అధ్యాపకులతో పాటు అనుభవం కలిగిన ఆర్టీసీ అధికారులతో తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ట్రేడ్‌లలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు కోరుకున్న టీజీఎస్‌ఆర్టీసీ డిపోల్లో అప్రెంటీషిప్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు హైదరాబాద్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9100664452, 040-23450033, వరంగల్ ఐటీఐ కళాశాల ఫోన్ నంబర్లు 9849425319, 8008136611 ను సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ల పూర్తి వివరాలను https://iti.telangana.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
సీట్ల వివరాలు:
- మోటార్ మెకానిక్ వెహికల్- 48 సీట్లు (2 Years)- 10వ తరగతి అర్హత
- మెకానిక్ డీజిల్ -24 సీట్లు (1 Years)- 10వ తరగతి అర్హత
- పెయింటర్ -20 సీట్లు (2 Years)- 8వ తరగతి అర్హత
- వెల్డర్ - 40 సీట్లు (1 Years)- 8వ తరగతి అర్హత