తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sathupally : పార్కింగ్ చేసిన లారీలే వీరి టార్గెట్.. డీజిల్ దొంగలు వస్తున్నారు జాగ్రత్త!

Sathupally : పార్కింగ్ చేసిన లారీలే వీరి టార్గెట్.. డీజిల్ దొంగలు వస్తున్నారు జాగ్రత్త!

26 October 2024, 12:37 IST

google News
    • Sathupally : ఆ హైవే.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతుంది. నిత్యం వందలాది లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రధాన నగరాలకు సరకు రవాణా చేస్తుంటాయి. ఆ లారీలనే టార్గెట్ చేశారు డీజిల్ దొంగలు. హైవేపై పార్కింగ్ చేసిన లారీలే టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు. డీజిల్‌ను పీల్చేస్తున్నారు.
డీజిల్ దొంగలు
డీజిల్ దొంగలు (istockphoto)

డీజిల్ దొంగలు

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో డీజిల్ దొంగలు రెచ్చిపోయారు. వందలాది లీటర్ల డీజిల్‌ను పీల్చేశారు. దీంతో లారీ డ్రైవర్లు ఓనర్లు లబోదిబోమంటున్నారు. సత్తుపల్లిలో నడి రోడ్డుపై పెట్టిన లారీల నుంచి వందల లీటర్ల డీజిల్‌ను దొంగతనం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. స్థానికంగా కలకలం రేపింది.

వైజాగ్ నుంచి, హైదరాబాద్ వైపు వెళుతున్న మూడు లారీలను సత్తుపల్లిలోని జేవీఆర్ కాలేజ్ గ్రౌండ్ సమీపంలో హైవే పక్కన పార్క్ చేశారు. అప్పటికే అలసిపోయిన డ్రైవర్లు నిద్రలోకి జారుకున్నారు. ఇదే అదునుగా డీజిల్ దొంగలు.. రెచ్చిపోయారు. ఆయిల్ ట్యాంకర్ల క్యాప్‌లను, లారీ ఇండికేటర్ వైర్లను తొలగించి వందలాది లీటర్ల డీజిల్‌ను పీల్చేశారు.

400 లీటర్ల కెపాసిటీతో ఉండే ఈ డీజిల్ ట్యాంకర్లలో ఒక్కో డీజిల్ ట్యాంక్ నుంచి సుమారు 300 లీటర్లు దొంగిలించారు. ఇలా మూడు లారీల నుంచి మొత్తం 900 లీటర్లు దొంగిలించారు. ఖమ్మం టు రాజమండ్రి హైవే రూట్‌లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. సుదూర ప్రాంతాల్ల నుండి భారీ వాహనాలు సత్తుపల్లి మీదగా వైజాగ్ పోర్టుకు, ఒడిశాకు వెళ్తుంటాయి. అయితే.. సత్తుపల్లి సేఫ్ జోన్ అని అక్కడి లారీలను నిలిపినట్టు డ్రైవర్లు చెబుతున్నారు.

సత్తుపల్లి పట్టణంలో డివైడర్ లైటింగ్, పోలీస్ స్టేషన్, సింగరేణి లారీ అసోసియేషన్ ఉండటంతో సేఫ్టీగా ఉంటుందని డ్రైవర్లు భావిస్తారు. ఇలాంటి చోట కూడ డీజిల్ చోరీ జరగడంతో డ్రైవర్లు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనం జరిగిన తీరును చూసి స్థానిక లారీ అసోసియేషన్ నాయకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది లారీలు పార్క్ చేస్తున్నాం.. ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరగలేదని అంటున్నారు.

ఇదో పెద్ద దందా..

ఎక్కువ దూరం వెళ్లే లారీలు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాయి. వీటిని టార్గెట్ చేస్తున్న ముఠా లారీలను ఫాలో అవుతుంది. పార్కింగ్ చేసిన తర్వాత డీజిల్‌ను దొంగిలిస్తారు. దాన్ని గ్రామాల్లో విక్రయించే దుకాణాలకు అమ్ముతుంటారు. పెట్రోల్ బంక్ కంటే తక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుంటారు. తక్కువ రేటుకు రావడంతో.. చిరు వ్యాపారులు ఈ డీజిల్‌ను కొని.. ట్రాక్టర్లు, ఆటోల వారికి అమ్ముతుంటారు.

ఈ చోరీల్లో కొందరు లారీ డ్రైవర్లు, క్లీనర్‌లు కూడా ఉంటారు. వారు రెగ్యులర్‌గా ప్రయాణించే రూట్లో దుకాణాదారులను పరిచయం చేసుకొని.. లారీ ట్యాంకుల నుంచి డీజిల్ తీసి అమ్మేస్తుంటారు. ఫలితంగా ఓనర్లు తీవ్రంగా నష్టపోతుంటారు. ఎక్కువగా జాతీయ రహదారులపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.

తదుపరి వ్యాసం