Kamareddy Police : పోలీస్ స్టేషన్‌లో చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్.. కామారెడ్డి పోలీసులు అందరికీ ఆదర్శం!
Kamareddy Police : కామారెడ్డి పోలీసులు.. ఇతర జిల్లాల అధికారులకు ఆదర్శింగా నిలుస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ప్రజల మన్ననలు పొందుతున్నారు. చిన్నారులను ప్రోత్సహించడమే కాకుండా.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ప్లేయింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఠాణాను పచ్చదనంతో నింపేశారు.
పోలీస్ స్టేషన్.. చాలా బిజీబిజీగా ఉంటుంది. ఎవరి పనుల్లో వారు నిమగ్నమై పోతారు. కొందరు ఏడుస్తూ కనిపిస్తారు. మరికొందరు బాధతో కూర్చుంటారు. ఇంకొందరు భయంతో వణికిపోతారు. వీటికి కారణాలు ఏమైనా.. పోలీస్ స్టేషన్ అంటనే చిన్నారులు భయపడే పరిస్థితి ఉంటుంది. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాలంటే చిన్నారులు వణికిపోతారు. అలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చారు కామారెడ్డి పోలీసులు.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దారులు, కక్షిదారులతో వచ్చే వారి పిల్లలు సేదతీరేలా ఏర్పాట్లు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్ నిర్మించారు. ఈ చిల్డ్రన్ ప్లేయింగ్ జోన్‌లో పచ్చదనంతో నిండిన ఉద్యానవనం.. పిల్లల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. చిన్నారులకు మానసిక ఉల్లాసాన్ని నింపుతున్నారు. పోలీస్ స్టేషన్ అంటే భయం లేకుండా వచ్చేలా చేస్తున్నారు.
కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. సీఐ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గొల్లవాడలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను పోలీసులు అందంగా తీర్చిదిద్దారు. స్కూలు బిల్డింగ్‌కు రంగులు వేయించారు. విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలను అందించారు. పుస్తకాలను ఉచితంగా ఇచ్చారు. పాఠశాల ఆవరణమంతా జాతీయ నాయకులు, శాస్త్రవేత్తల సందేశాలు, సందేశాత్మక చిత్రాలు గీయించారు.
'నేటి బాలలే రేపటి పౌరులు అని మన జాతీయ నాయకులు చెప్పారు. అందుకే పిల్లల మనసుకు నేరం మరకలు అంటొద్దని ప్రయత్నిస్తాను. చిన్నారుల పోలీస్ స్టేషన్‌లో ప్లేయింగ్ జోన్ ఏర్పాటు చేయించాం. సామాజిక బాధ్యతగా చిన్నారుల కోసం వివిధ కార్యక్రమాలు చేపడుతున్నా. మా కుటుంబ సభ్యుల పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని.. గొల్లవాడ పాఠశాల బాగుకోసం కొంత ఖర్చు చేశాను' అని సీఐ చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కేవలం ఈ విషయాల్లోనే కాదు.. ఫిర్యాదులు స్వీకరించడం, దర్యాప్తు చేయడంలోనూ కామారెడ్డి పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు. కేసులు, సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తున్నారు. ఆపద అంటే ఆలోచించకుండా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపడుతూ.. ఇతర ఠాణాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తారు.