Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్-district medical officer arrested in kamareddy for molestation and harassment of doctors ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy Dmho: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డిలో కామపిశాచి, వైద్యులపై వేధింపుల కేసుతో జిల్లా వైద్యాధికారి అరెస్ట్

Sarath chandra.B HT Telugu
May 17, 2024 09:44 AM IST

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో కీచక డాక్టర్‌ను పోలీసులు అరెెస్ట్‌ చేశారు. విధుల్లో ఉన్న మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

కామారెడ్డి డిఎంహెచ్‌ఓ అరెస్ట్
కామారెడ్డి డిఎంహెచ్‌ఓ అరెస్ట్

Kamareddy DMHO: కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ మహిళా వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో డిఎంహెచ్‌ఓ వైఖరిపై మహిళా వైద్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్‌ లక్ష్మణ్‌ సింగ్‌ను అరెస్ట్ చేశారు.

కామారెడ్డి జిల్లాలో వైద్యులపై లైంగిక వేధింపులకు పాల్పడిన జిల్లా వైద్యాధికారి కటకటాల పాలయ్యారు. మరో ఏడాదిలో పదవి విరమణ చేయాల్సి ఉండగా వికృత చేష్టలకు పాల్పడటంతో కటకటాలు లెక్కించాల్సి వచ్చింది. జిల్లా వైద్యాధికారి తీరుపై మహిళా డాక్టర్లు ఫిర్యాదు చేయడంతో వైద్య ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ ఘటనపై బాధితులు ఫిర్యాదు చేయడంతో డాక్టర్‌ లక్ష్మణ్‌ సింగ్‌ను కామారెడ్డిలో పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న మహిళా డాక్టర్లు వేర్వేరుగా ఇచ్చిన ఫిర్యాదులపై దేవునిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఏడు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. డీఎంహెచ్‌వోను కోర్టులో హాజరుపరచడంతో అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

డిఎంహెచ్‌ఓ లక్ష్మణ్‌ సింగ్‌ తమను ఏడాదిన్నరగా గా లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా వైద్యులు ఆరోపించడం సంచలనం సృష్టించింది. బాధితుల ఫిర్యాదు మేరకు లక్ష్మణ్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు మంగళవారం ఐదు కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. బుధవారం మరో ఇద్దరు డాక్టర్లు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు.

మహిళా వైద్యులపై వేధింపుల వ్యవహారంలో వైద్యఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌ నాయక్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై శుక్రవారం మరోసారి విచారణ జరుగనుంది. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ఆదేశాలతో ముగ్గురు మహిళా అధికారులు విచారణ జరుపనున్నారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. డీఎఫ్‌వో, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

డిఎంహెచ్‌ఓ వికృత చేష్టలు…

జిల్లాలో వైద్య సేవల్ని పర్యవేక్షించే బాధ్యతాయుతమైన పోస్టులో ఉన్న డిఎంహెచ్‌ఓ కొంత కాలంగా మహిళా వైద్యుల్ని వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మహిళలతో అనుచితంగా మాట్లాడటంతో వారు విసిగిపోయారు. ఈ నెల 8వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగిన ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో డిఎంహెచ్‌ఓ తీరుపై వైద్యులు ఫిర్యాదు చేశారు.

డీఎంహెచ్‌వో తమతో అసభ్యంగా మాట్లాడుతున్నారని మహిళా వైద్యాధికారులు ఆరోపించారు. ఆ తర్వాత రోజు కలెక్టర్‌, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. మొదట ఐదుగురు వైద్యులు ఫిర్యాదు చేయగా, ఆ తర్వాత ఇద్దరు మహిళా వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంహెచ్‌వోపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశారు.

ఈ పరిణమాలతో వైద్య శాఖ ఏడీ అమర్‌సింగ్‌ బుధవారం కామారెడ్డి జిల్లా వచ్చి విచారణ చేపట్టారు. విధి నిర్వహణలో ఉన్నపుడు డీఎంహెచ్‌వో చేతులు తాకడం, ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో వివరించారు. వారి ఆరోపణల ఆధారంగా ఏడీ నివేదిక రూపొందించారు.

మహిళా వైద్యాధికారులు గురువారం హైదరాబాద్‌‌లో తెలంగాణ రాష్ట్ర వైద్యశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల మధ్య డీఎంహెచ్‌వోను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు డీఎస్పీ నాగేశ్వర్‌రావు తెలిపారు. లక్ష్మణ్‌సింగ్‌ 2022 నుంచికామారెడ్డిలో విధుల్లో కొనసాగుతున్నారు. 2025మేలో రిటైర్ కానున్నారు.

Whats_app_banner