తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Dharani Portal Services : ధరణి పోర్టల్‌ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ - ఎప్పటివరకంటే

TG Dharani Portal Services : ధరణి పోర్టల్‌ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ - ఎప్పటివరకంటే

12 December 2024, 19:03 IST

google News
    • Telangana Dharani Portal Services : ధరణి సేవలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డేటాబేస్ వెర్షన్ అప్ గ్రేడ్ కారణంగా... ధరణి పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని తెలిపింది. డిసెంబర్ 16వ తేదీ వరకు సేవలు ఉండవని పేర్కొంది.
ధరణి పోర్టల్ సేవలు
ధరణి పోర్టల్ సేవలు

ధరణి పోర్టల్ సేవలు

ధరణి పోర్టల్ సేవలకు సంబంధించి తెలంగాణ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 16వ తేదీ వరకు పోర్టల్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఓ ప్రకటనలో పేర్కొంది.  డేటాబేస్ వెర్షన్ అప్ గ్రేడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 16వ తేదీ ఉదయం వరకు అప్ గ్రేడ్ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంటుందని వివరించింది. 

ధరణి పోర్టల్ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఇటీవలే మీడియాతో మాట్లాడిన మంత్రి పొంగులేటి.. కీలక విషయాలను వెల్లడించారు. నిపుణుల కమిటీ రిపోర్టు ఆధారంగా ధరణి పోర్టల్ ను ఎలా ప్రక్షాళన చేయాలని చూస్తున్నామన్నారు. ప్రజలకు మంచి జరిగేలా ధరణి పోర్టల్ లో మార్పులు చేస్తామని చెప్పుకొచ్చారు. 

2020 ఆర్‌వోఆర్‌ చట్టంలో లోపాలు సరిచేసి 2024 ఆర్‌వోఆర్‌ చట్టం తెస్తున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని 9వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. ధరణి కొత్త యాప్‌, కొత్త చట్టం సామాన్యులకు చాలా ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్‌వో వ్యవస్థను రాత్రికి రాత్రే రద్దు చేసిందన్నారు. అయితే రెవెన్యూ గ్రామాలకు ఒక అధికారి ఉండాలనేది స్థానికులు అభిప్రాయం అన్నారు.

అసెంబ్లీ సమావేశాలు - కొత్త ఆర్వోఆర్‌ చట్టం..!

భూముల నిర్వహణకు సంబంధించి తెలంగాణలో కొత్త చట్టం రాబోతుంది. ఇప్పటికే ‘ది తెలంగాణ రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ బిల్‌-2024’ ముసాయిదాను కూడా ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రజాభిప్రాయాలను సేకరించారు. ఇప్పుడు జరగబోయే….అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్ బిల్లు ప్రవేశపెట్టి… ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. 

ఈ ముసాయిదా బిల్లు పేర్కొన్న వివరాల ప్రకారం….. ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్‌ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే చేసిన తర్వాత శాశ్వత భూదార్‌ కేటాయిస్తారు. 2020లో తీసుకొచ్చిన ఆర్వోఆర్ చట్ట ప్రకారం… చాలా ఇబ్బందులు ఉన్నాయి. 

అప్పీల్, రివిజన్ వ్యవస్థలు లేకపోవటంతో భూ యజమానులకు అనేక సమస్యలు ఏర్పడ్డాయి. కలెక్టర్లకు ఎక్కువ అధికారాలు ఉండటంతో క్షేత్రస్థాయిలోని అధికారులు ఏం చేయలేని పరిస్థితి ఉండేది. అయితే కొత్త చట్టంలో మూడంచెల అప్పిలేట్‌ అథారిటీలను నియమించనున్నారు. తహసీల్దారు, ఆర్డీవోల మ్యుటేషన్లపై అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది.

ఆర్వోఆర్‌ రికార్డుల్లో తప్పులుంటే వాటిపై మొదటి అప్పీలుపై రివిజన్‌ అధికారాలు కలెక్టర్‌ లేదా అదనపు కలెక్టర్‌కు ఇవ్వనున్నారు, ఇక రెండో అప్పీలుపై సీసీఎల్‌ఏకు, మూడో అప్పీలుపై ప్రభుత్వానికి చేసుకునే వీలు ఉంటుంది. కొత్త చట్టం ద్వారా పహాణీలను కూడా అప్డేట్ చేస్తారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 16వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది.

తదుపరి వ్యాసం