తెలుగు న్యూస్ / తెలంగాణ /
Telangana Cabinet Decisions : భూమాతగా ధరణి పోర్టల్, కొత్త రేషన్ కార్డుల జారీకి ఆమోదం - కేబినెట్ నిర్ణయాలివే
Telangana Cabinet Meeting Decisions : తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మార్చటంతో పాటు పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
తెలంగాణ కేబినెట్ (ఫైల్ ఫొటో)
Telangana Cabinet Meeting : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. కొత్త రేషన్ కార్డులను త్వరిగతిన మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
కేబినెట్ నిర్ణయాలు….
- ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.
- కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.(సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి, ఉత్తమ్ , దామోదర రాజనర్సింహ.)
- జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం.
- • క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్ కు హైదరాబాద్ లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్ కు, సిరాజ్ కు గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది.
- గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
- కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను జారీ చేయాలని నిర్ణయం.
- జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించే ముసాయిదా బిల్లుకు ఆమోదం.
- గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి, అమీర్ అలీఖాన్.
- కేరళలో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది.
- •ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్ కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానం.
- • ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ పి.మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.
- •గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది.
- •నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది.
- •మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్ పేట చెర్వు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి…. అందులో 10 టీఎంసీలతో చెర్వులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించారు.