Delhi Liquor Case: 'బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా' - వెలుగులోకి సంచలన లేఖ!
31 March 2023, 22:49 IST
Sukesh Chandrasekar Letter against Kejriwal: మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కేజ్రీవాల్ చెప్పినట్లు బీఆర్ఎస్ కి రూ.75 కోట్లు అందజేశానని పేర్కొన్నాడు. త్వరలోనే వాట్సాప్ చాట్స్ కూడా బయటపెడతానని స్పష్టం చేశారు.
సుఖేష్ చంద్రశేఖర్
Delhi Liquor Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఓ లేఖ సంచలనం సృష్టిస్తోంది. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. తన అడ్వొకేట్ ద్వారా ఈ లేఖను విడుదల చేశాడు. ఇందులో కేజ్రీవాల్ టార్గెట్ గా కీలక విషయాలను ప్రస్తావించాడు. కేజ్రీవాల్ చెప్పినట్లే 2020లో టీఆర్ఎస్(BRS)కు కు రూ. 75 కోట్లు ఇచ్చానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ కూడా ఉన్నాయని తెలిపాడు. మొత్తం 700 పేజీలతో కూడా చాట్ ఉందని స్పష్టం చేశాడు. ఈ మేరకు తన తరపు అడ్వొకేట్ అనంత్ మాలిక్ ద్వారా లేఖను విడుదల చేశాడు. అందులో ఈ వివరాలను పేర్కొన్నాడు.
" కేజ్రీవాల్ జీ... 2020 ఏడాదిలో 15 కేజీల నెయ్యి(కోడ్ - 15 కోట్లు)కి సంబంధించిన చాట్ బయటపెడ్తాను. నువ్వు, మిస్టర్ జైన్.. నా ద్వారా టీఆర్ఎస్ పార్టీకి డబ్బులు పంపిన విషయాన్ని బయటపెడ్తాను" అంటూ సుఖేష్ రాసుకొచ్చాడు హైదరాబాద్ లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం వద్ద లిక్కర్ కేసు నిందితుల్లో ఒకరికి ఈ నగదు ఇచ్చినట్లు తెలిపాడు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద పార్క్ చేసిన రేంజ్ రోవర్ కారులో ఉన్న 'ఏపీ' అనే వ్యక్తికి ఈ 15 కోట్లు ఇచ్చానని తెలిపాడు. ఇప్పటికే 5 నెయ్యి కేసులు హైదరాబాద్‌కు పంపించినట్లుగా చెప్పుకొచ్చాడు. హైదారాబాద్‌కు మొత్తం రూ.75 కోట్లు చేరవేశానని పేర్కొన్నాడు.
ఇటీవల సుఖేష్ చంద్రశేఖర్ ను కోర్టులో హాజరుపరిచిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. కేజ్రీవాల్ కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని... త్వరలోనే తీహార్ క్లబ్‌లో వస్తారని జోస్యం చెప్పాడు. ఇప్పుడు వాట్సాప్ చాట్ బయటపెడ్తానంటూ లేఖ విడుదల చేయటంతో లిక్కర్ కేసు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
ఇక ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా విచారిస్తోంది ఈడీ. ఆమె వాడిన ఫోన్లను కూడా సేకరించి డేటాను విశ్లేషిస్తోంది. త్వరలోనే మరోసారి ఆమెను విచారించనుంది. ఈ నేపథ్యంలో సుఖేశ్ లేఖలో టీఆర్ఎస్ పేరు రావటంతో… లిక్కర్ కేసులో ఏం జరగబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.