ED Fresh Notices: ఈడీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కవిత లాయర్..
ED Fresh Notices: బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్ మూడు వారాల పాటు వాయిదా పడిన నేపథ్యంలో మంగళవారం కవిత తరపు న్యాయవాది సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వచ్చారు.
ED Fresh Notices: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. విచారణ పేరుతో ఈడీ తనను వేధిస్తోందని, మహిళల్ని విచారించే విషయంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇంట్లో విచారించే అవకాశం ఉన్నా ఈడీ రాత్రి పొద్దుపోయే వరకు విచారణ పేరుతో వేధిస్తోందని కవిత ఫిర్యాదు చేశారు. కవిత పిటిషన్‌పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం మూడు వారాల పాటు వాయిదా వేసింది.
మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే మూడు సార్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు. తొలిసారి మార్చి 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. అదే రోజు కవిత మొబైల్‌ఫోన్‌ను ఈడీ సీజ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఏడాది వ్యవధిలో ఎమ్మెల్సీ కవిత పది ఫోన్లను మార్చారని, ఆధారాలను మాయం చేశారని ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో మార్చి 20వ తేదీన కవిత మరోమారు ఈడీ విచారణకు హాజరయ్యారు. మరుసటి రోజు కూడా విచారణకు రావాల్సిందిగా ఆదేశించడంతో అదే రోజు 9 ఫోన్లను కవిత అప్పగించారు.
మరోవైపు కవిత నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను తెరిచేందుకే కవిత తరపు న్యాయవాది సోమాభరత్‌ను సాక్షిగా పిలిచినట్లు తెలుస్తోంది. కవిత ఫోన్లలో కీలక సమాచారం ఉంటుందని ఈడీ భావిస్తోంది. కవిత తరపు న్యాయవాది సమక్షంలోనే ఆమె ఫోన్లను తెరవనున్నట్లు తెలుస్తోంది. కవిత ఫోన్లను ఈడీ తెరవనున్న నేపథ్యంలో కవిత విచారణకు హాజరు కావాలని, కవిత హాజరు కాలేకపోతే ఆమె తరపు ప్రతినిధిని పంపాల్సిందిగా ఈడీ సూచించింది. దీంతో కవిత న్యాయవాది ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన సౌత్‌గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది. ఎమ్మెల్సీ కవిత ప్రమేయాన్ని నిర్ధారించేందుకు ఆమె వినియోగించిన ఫోన్లు కీలకమని భావిస్తోంది. కవిత ఈడీకి అప్పగించిన ఫోన్లను కవిత తరపు ప్రతినిధుల సమక్షంలోనే సైబర్ నిపుణులతో డేటాను రిట్రైవ్ చేసేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది. 2021 జూన్ 2022 ఆగష్టు మధ్య కాలంలో కవిత వినియోగించిన ఫోన్లలో కీలక సమాచారం ఉంటుందని ఈడీ భావిస్తోంది.
కవిత తరపున ప్రతినిధులు లేకుండా ఫోన్లను తెరిచేందుకు ప్రయత్నిస్తే, ఆ ప్రక్రియపై ఆరోపణలు చేసే అవకాశం ఉన్నందున కవిత తరపు న్యాయవాది సమక్షంలో ఫోన్లను పరిశీలించాలని ఈడీ భావిస్తోంది.