దిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణం ఎవరు అరెస్టు అవుతారోనని ఆసక్తిగా నెలకొంది. ఇంకోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)ను కూడా ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే ఆమె అరెస్టు మీద పుకార్లు మెుదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఈ కేసులో ఎంతమంది అరెస్టు అయ్యారు? ఎవరెవరు అరెస్టు అయ్యారు?
దిల్లీ లిక్కర్ కే(Delhi Liquor Case)సులో ఏ1 ముద్దాయిగా ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్రు ఉన్నారు. 2022 సెప్టెంబర్ 28న ఈడీ అరెస్టు చేసింది. సెక్షన్ 45, ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ చట్టం కింద సెప్టెంబర్ 30న అతడి మీద ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక అప్పటి నుంచి దర్యాప్తు మీద ఈడీ దూకుడు పెరిగింది.
ఈ కేసులో మరో కీలక వ్యక్తి అరబిందో గ్రూప్ ఫార్మా డైరెక్టర్ పెనక శరత్ చంద్రా రెడ్డి. ఇతడిని నవంబర్ 11న ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో బినోయ్ బాబుతో కలిసి శరత్ రిటైల్ లెసెన్స్ ఇప్పించినట్టుగా ఈడీ గుర్తించింది. లిక్కర్ లైసెన్సులు రేట్లను ఫిక్స్ చేయడంలో శరత్ చంద్రారెడ్డి కీలక పాత్ర ఉందని.. ఈడీ గుర్తించింది.
ఇక మరో కీలక వ్యక్తి.. బినోయ్ బాబు. ఈయన పెర్నోడ్ రిచర్డ్ ఇంటర్నేషనల్ లిక్కర్ బ్రాండ్ కంపెనీ జనరల్ మేనేజర్. ఈ కేసులో కీలకమైన వ్యక్తి. నవంబర్ 11న శరత్ చంద్రా రెడ్డితో పాటు ఇతడు కూడా అరెస్టు అయ్యాడు. బినోయ్ 29 లైసెన్సులు రిటైల్ వ్యాపారులకు ఇప్పించినట్టుగా ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.
దిల్లీ మద్యం కుంభకోణంలో తెలుగు రాష్ట్రాల నుంచి అరెస్టు అయిన మెుదటి వ్యక్తి అభిషేక్ రావు(Abhishek Rao). నవంబర్ 13న ఈడీ అరెస్టు చేసి.. కస్టడీకి తీసుకుంది. ఈయనకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్టుగా ఈడీ గుర్తించింది. మెుదటి నుంచి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొవడంతో ఈడీ ప్రత్యేకంగా అభిషేక్ మీద ఫోకస్ పెట్టింది. ఈ స్కామ్ లో రూ.3.85 కోట్లు అభిషేక్ రావు అకౌంట్లో నుంచి ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుకు వచ్చినట్టుగా కోర్టుకు సీబీఐ తెలిపింది. మెుదట సౌత్ లాబీ పేరుతో మెుత్తం మూడు అకౌంట్ల నుంచి అభిషేక్ ఖాతాల్లో జమ అయిందని తెలిసింది.
ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ కూడా ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈడీ గుర్తించింది. నవంబర్ 13న అరెస్టు చేసింది. లిక్కర్ పాలసీపై అక్రమ లావాదేవీలపై విజయ్ ని అరెస్టు చేశారు. లిక్కర్ పాలసీ 2021లో మార్పులు చేసేలా ప్రైవేటు లిక్కర్ హోల్ సేలర్ల నుంచి డబ్బులు సమీకరించినట్టుగా ఈడీ తెలుసుకుంది.
బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరా(Amit Arora) నవంబర్ 29న అరెస్టు అయ్యారు. దిల్లీ మద్యం వ్యాపారాలు జరుపుతుంటారు. పాలసీ రూపకల్పనలో కీలక వ్యక్తిగా ఉన్నాడని చెబుతుంటారు. దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు అత్యంత ముఖ్యమైన సన్నిహితుల్లో ఒకడిగా పేరుంది.
గౌతమ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 8న ఈ కేసులో అరెస్టు అయ్యారు. లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా స్కాం జరిపినట్లు ఈడీ తెలిపింది. మరోవైపు ఫిబ్రవరి 9న చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేశ్ జోషిని ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూపునుకు రూ.31 కోట్ల నగదును బదిలీ చేయడంలో రాజేశ్ జోషి కీలకంగా వ్యవహరించాడట.
దిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్టు(manish sisodia arrest) చేయడం కీలక మలుపు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో సిసోడియాది కీలక పాత్ర. పలు లావాదేవీలపై అనుమానాలు, లిక్కర్ స్కామ్ రూపకల్పన వహించాడని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి.
ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవను కూడా ఈ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 11న అదుపులోకి తీసుకుంది. సౌత్ గ్రూపు(South Group)లో రాఘవ ముఖ్యమైన పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. దిల్లీ బిజినెస్ మెన్ అమన్ దీప్ సింగ్ ను మార్చి 2న ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూపుతో అమన్ దీప్ సింగ్ కు సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించారని అరుణ్ రామచంద్ర పిళ్లై(ramachandra pillai) మీద ఆరోపణలు ఉన్నాయి. మార్చి 6న ఈడీ అరెస్టు చేసింది. మరో నిందితుడు సమీర్ మహేంద్రతో కలిసి దిల్లీ లిక్కర్ స్కామ్ లో రామచంద్ర పిళ్లై కీలకంగా వ్యవహరించారని గుర్తించారు. అంతేకాదు.. హవాలా రూపంలో నగదు లావాదేవీలు చేశారని, మరిన్ని వివరాలు రాబట్టాలని ఈడీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత పిళ్లై తీహడ్ జైలుకు తరలించారు.
దిల్లీ మద్యం కుంభకోణంలో వరుస అరెస్టులతో ఈ కేసుపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేస్తోంది. తదుపరి అరెస్టు ఎవరు అనే విషయంపై ఆసక్తి నెలకొంది.