Skin Peeling: చలికాలంలో చేతి గోర్ల దగ్గర చర్మం పొలుసుగా మారి రాలిపోతోందా? ఎందుకు.. ఏం చేయాలి?
Skin Peeling: చలికాలంలో చర్మ సమస్యలు అధికం అవుతాయి. కొందరికి చేతి గోర్ల చుట్టూ చర్మం పొలుసుగా మారి రాలుతుంది. ఇది చూడడానికి బాగుండదు. అలాగే చాలా ఇబ్బందులు కలుగుతాయి.
చేతి గోర్ల చుట్టూ చర్మం పొలుసుగా మారితే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చూసేందుకు అసలు బాగోదు. పొలుసుగా మారి చర్మ రాలితే చాలా సమస్యలు ఎదురవుతాయి. చేతులతో తినే సమయంలో నొప్పిగా అనిపిస్తుంది. చలికాలంలో కొందరికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటంతో దీని తీవ్రత మరింత ఎక్కువ అవుతుంది. చేతి గోర్ల చుట్టూ పొలుసుగా అయ్యేందుకు కారణాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
చర్మం పొలుసుగా అయ్యేందుకు కారణాలు
చలికాలంలో వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. అలాంటి సమయాల్లో కొందరికి చేతి గోర్ల వద్ద చర్మం పొలుసుగా మారే సమస్య ఎక్కువవుతుంది. చేతులను అతిగా కడగడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. రసాయనాలు ఉన్న పదార్థాలు వాడడం, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కొందరిలో ఈ సమస్య తలెత్తుతుంటుంది.
ఈ జాగ్రత్తలు పాటించండి
కొబ్బరి నూనె: చర్మం పొలుసుగా మారిన చోట కొబ్బరి నూనె రాయాలి. నూనెతో మాస్ చేసినట్టుగా అనాలి. దీంతో పొలుసుగా మారిన చర్మం ఊడిపోయి.. తేమగా మారుతుంది. చర్మం మళ్లీ బాగా వచ్చేందుకు తోడ్పడుతుంది.
మాయిశ్చరైజర్ వాడాలి: చలికాలంలో చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్ వాడాలి. ముఖ్యంగా చేతి వేళ్లకు మొత్తంగా ఇది పట్టించాలి. చర్మం పొడిబారకుండా జాగ్రత్త తీసుకోవాలి. పెట్రోలియం జెల్లీ కూడా రాసుకోవచ్చు.
సరిపడా నీరు: చలికాలంలో చర్మ సమస్యలు ఎక్కువగా వచ్చేందుకు సరిపడా నీరు తాగకపోవడం కూడా ఓ కారణంగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటంతో కొందరు నీరు కావాల్సినంత తాగరు. అయితే, చర్మం పొలుసుబారే సమస్య తగ్గాలంటే తగినంత నీరు తాగుతూ హైడ్రేటెడ్‍గా ఉండాలి.
పోషకాహారం: ప్రతీ రోజు తప్పనిసరిగా పండ్లు, ఆకుకూరలను డైట్‍లో తీసుకోవాలి. వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ లభిస్తాయి. ఏదైనా విటమిన్ లోపం వల్ల చర్మానికి ఇబ్బంది ఉండే అది తొలగిపోతుంది. అందుకే పోషకాలు ఉండే పండ్లు, కూరగాయాలు, ఆకుకూరలు తీసుకోవాలి.
ఇవి ఎక్కువ వాడొద్దు: ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లు, కాస్మోటిక్‍లను ఎక్కువగా వాడకూడదు. హ్యార్ష్ కెమికల్స్ ఉండే వాటిని కూడా దూరంగా ఉండాలి. కిచెన్‍లో పని చేస్తున్నప్పుడు గ్లౌవ్స్ ధరించడం మేలు.