Medaram Maha Jatara 2024 : సిబ్బందికి హెల్మెట్స్ - మేడారంలో మాటలకే పరిమితమైన 'కన్వేయర్ బెల్ట్'
22 February 2024, 18:29 IST
- Medaram Maha Jatara 2024 Updates: మేడారంలో కన్వేయర్ బెల్ట్ ప్రతిపాదన మాటలకే పరిమితమైంది. హెల్మెట్స్ ధరించే గద్దెల వద్ద డ్యూటీలో ఉన్నవారు విధులు నిర్వర్తిస్తున్నారు.
మేడారం జాతరలో సిబ్బంది
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: సమ్మక్క–సారలమ్మకు భక్తులకు సమర్పించే ఎత్తు బంగారాన్ని గద్దెల వద్దకు సురక్షితంగా చేర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న కన్వేయర్ బెల్ట్ ప్రతిపాదన మాటలకే పరిమితమైంది. తమ ఎత్తు బంగారం తల్లుల చెంతకు చేరాలనే ఉద్దేశంతో భక్తులు దూరం నుంచే బెల్లం బుట్టాలు గద్దెల మీదకు విసురుతుండగా.. అక్కడున్న సిబ్బంది, మిగతా భక్తులకు దెబ్బలు తగులుతున్నాయి. కొబ్బరికాయలతో తలలు పగిలే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతోనే ప్రభుత్వం కన్వేయర్ బెల్ట్ ప్రతిపాదన తీసుకొచ్చినా కొన్నేళ్లుగా దానికి మోక్షం కలగడం లేదు. ఫలితంగా గద్దెల ప్రాంతంలో విధులు నిర్వర్తించే సిబ్బందికి ఎత్తు బెల్లం దెబ్బలు తప్పడం లేదు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు, ప్రముఖులకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
బెల్లం విసురుతుండటంతో గాయాలు
మేడారం జాతర అంటేనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కోట్లాది మంది తరలివచ్చే మహా పండుగ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చిన సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకునే వేడుక. ఇక్కడ అమ్మవార్లకు ఎత్తు బంగారం పేరున బెల్లాన్ని సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతోనే సమ్మక్క–సారలమ్మకు మొక్కుకున్న మేరకు భక్తులు చాలావరకు తమ బరువుతో సమానంగా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తుంటారు. భక్తి శ్రద్ధలతో తీసుకొచ్చిన బెల్లం గద్దెల మీదకు చేరినప్పుడు తమ మొక్కు తీరినట్టుగా భావిస్తుంటారు. ఈ మేరకు తీసుకొచ్చిన ఎత్తు బంగారాన్ని గద్దెల మీద పెట్టేందుకు ప్రయత్నం చేస్తుంటారు. కానీ అక్కడ రష్ వల్ల బెల్లం బుట్టాలు సమ్మక్క గద్దెల వద్దకు వెళ్లి పెట్టలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతోనే భక్తులు దూరం నుంచే బెల్లం బుట్టాలు, కొబ్బరికాయలు విసురుతుంటారు. ఇదిలాఉంటే గద్దెల ప్రాంతంలో ఎప్పటికప్పుడు భక్తులు సమర్పించే బెల్లం, ఒడిబియ్యం, పసుపు, కుంకుమలు, గాజులు, కొబ్బరికాయలను తరలించేందుకు సిబ్బంది పని చేస్తుండగా.. భక్తులు విసిరే బెల్లంతో సిబ్బంది గాయపడిన సందర్భాలు చాలానేఉన్నాయి.
జాతర ముందు హడావుడి
ఎత్తు బంగారాన్ని సమర్పించేందుకు భక్తులు కిలో సైజు నుంచి రూ.25 కిలోల బుట్టాలను కూడా తీసుకొస్తుంటారు. క్యూ లైన్లలో వాటిని తలపై ఎత్తుకుని దర్శనం పూర్తయ్యేంతవరకు మోస్తుంటారు. దీంతో భక్తులు అసౌకర్యానికి గురవడంతో పాటు బరువుతో ఇబ్బందులు తలెత్తేవి. దీంతోనే ఈసారి జాతరకు రూ.80 లక్షలతో కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తులు తీసుకొచ్చే ఎత్తు బంగారాన్ని కన్వేయర్ బెల్ట్ లో పెడితే అదే నేరుగా బెల్లాన్ని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేరుతుందని భావించారు. కానీ అదికాస్త మాటలకే పరిమితమైంది. కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేయకపోవడంతో సమస్య అలాగే కొనసాగుతోంది.
ప్రముఖులకూ తప్పని ఇబ్బందులు
బెల్లం బుట్టాలతో పాటు కొబ్బరికాయలను గద్దెల వద్దకు విసురుతుండటంతో అక్కడ పని చేసే పోలీస్, శానిటేషన్ సిబ్బందికి హెల్మెట్స్, సేఫ్ గార్డ్స్ ఇచ్చి విధులు నిర్వహిస్తున్నారు. ఇక ఎవరైనా ప్రముఖులు దర్శనానికి వచ్చిన సమయంలో వారికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఓ వైపు పైనుంచి వచ్చే బెల్లం బుట్టాలను తప్పించుకునేందుకు హెల్మెట్స్, గార్డ్స్ వాడటంతో పాటు గద్దెల దర్శనానికి వచ్చిన ప్రముఖులనూ ప్రొటెక్ట్ చేసేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తాజాగా రాష్ట్ర మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శనకు వచ్చిన సమయంలో కూడా ఇదే సమస్య ఎదురైంది. వారు అమ్మవార్లను దర్శించుకోవడానికి గద్దెల వద్దకు చేరుకోగా.. వారికి దెబ్బలు తగలకుండా సేఫ్ గార్డ్స్ అడ్డుపెట్టి రక్షణ కల్పించారు. కాగా ప్రతిసారి జాతర ముందు కన్వేయర్ బెల్ట్ ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేయడం, ఆ తరువాత షరా మామూలే అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ఈ సంవత్సరం కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. కానీ ఆ పనులకు అడుగులు పడలేదు. కాగా ప్రతిసారి జాతర ముందు హడావుడి చేయడం తప్ప సమస్యకు పరిష్కారం చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా మేడారం మహాజాతరకు ముందస్తుగా పనులు చేపట్టి, జాతర ప్రారంభానికి కొంత ముందుగానే కన్వేయర్ బెల్ట్ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభించాలని సిబ్బందితో పాటు భక్తులు డిమాండ్ చేస్తున్నారు.