Medaram Maha Jatara : ఎత్తు బంగారం నేరుగా తల్లుల చెంతకే, మేడారంలో కన్వేయర్ బెల్ట్ ఏర్పాటుకు చర్యలు
Medaram Maha Jatara : మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని భక్తులు తెల్ల బెల్లాన్ని ఎత్తు బంగారాన్ని సమర్పించుకుంటారు. బెల్లం బుట్టాలను నేరుగా తల్లుల చెంతకు చేరేలా కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేస్తున్నారు.
Medaram Maha Jatara : మేడారం.. కోట్లాది మంది తరలివచ్చే మహాజాతర. తెలంగాణ, ఏపీతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చి సమ్మక్క–సారలమ్మ గద్దెలను దర్శించుకుంటుంటారు. కోరిన కోర్కెలు తీర్చాలంటూ తెల్ల బెల్లాన్ని ఎత్తు బంగారంగా సమర్పిస్తుంటారు. సమ్మక్క జాతర సమయంలో ఎత్తు బంగారం సమర్పించే క్రమంలో గద్దెల వద్ద భక్తుల రద్దీ ఉంటుండటంతో కొంతమంది దూరం నుంచే బెల్లాన్ని విసురుతుంటారు. దీంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు, ఎండోమెంట్ సిబ్బందికి దెబ్బలు తగిలేవి. గద్దెల సమీపంలోని భక్తులు కూడా బెల్లం బుట్టాలు తగిలి అవస్థలు పడేవారు. కాగా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం వనదేవతల మహాజాతర ప్రారంభం కానుండగా.. భక్తులకు ఇబ్బందులకు కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే రోడ్లు, టాయిలెట్స్, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటు బెల్లం బుట్టాలను నేరుగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు చేర్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. ఎవరికీ దెబ్బలు తగకుండా ఎత్తుబంగారాన్ని తల్లుల చెంతకు చేరేలా ప్లాన్ చేసింది.
రూ.80 లక్షలతో కన్వేయర్ బెల్ట్
ఎత్తు బంగారాన్ని సమర్పించేందుకు భక్తులు కిలో సైజు బుట్టాల నుంచి రూ.25 కిలోల బుట్టాలను కూడా తీసుకొస్తుంటారు. క్యూ లైన్లలో వాటిని తలపై ఎత్తుకుని దర్శనం పూర్తయ్యేంతవరకు మోసేవారు. దీంతో భక్తులు అసౌకర్యానికి గురవడంతో పాటు బరువుతో కొంత ఇబ్బంది పడేవారు. దీంతోనే ప్రభుత్వం సింగరేణి బొగ్గును తరలించే మాదిరిగా తగిన ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి, రూ.80 లక్షలతో కన్వేయర్ బెల్ట్ ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. భక్తులు తీసుకొచ్చే ఎత్తు బంగారాన్ని కన్వేయర్ బెల్ట్ లో పెడితే అదే నేరుగా బెల్లాన్ని సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్దకు చేరుస్తుంది. దీంతో భక్తులు బంగారాన్ని విసిరే అవకాశం లేకుండా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఎండోమెంట్ అధికారులు ఇప్పటికే వన దేవతల గద్దెల చుట్టూ బెల్ట్ ఏర్పాటుకు పరిశీలించి వెళ్లారు. కొద్దిరోజుల్లోనే దానికి సంబంధించిన పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ కన్వేయర్ బెల్ట్ సదుపాయం సక్సెస్ అయితే భక్తులకు బెల్లం విసిరే బాధ తీరిపోనుంది. అంతేగాకుండా ఇష్టమొచ్చినట్టు బెల్లాన్ని విసరడం వల్ల గద్దెల చుట్టూ వాతావరణం అంతా బెల్లంతో నిండిపోయేది. అందులోనే గాజులు, కొబ్బరి చిప్ప ముక్కలు చిక్కుకుని భక్తుల కాళ్లకు గుచ్చుకునేవి. బెల్లం తొక్కుడుకు గురికావడంతో ఈగల సమస్య కూడా తీవ్రంగానే ఉండేది. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ ఏర్పాటు చేస్తే ఆ సమస్యలన్నీ తీరిపోనున్నాయి. ప్రయోగాత్మకంగా ఈ జాతర నుంచే కన్వేయర్ బెల్ట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా.. అది సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)