Warangal : 50 ఏళ్ల తరువాత కొత్త వంతెన - 8 కోట్లతో నయీంనగర్ బ్రిడ్జి పనులు, 3 నెలలు రాకపోకలు బంద్
05 April 2024, 21:25 IST
- Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జికి మోక్షం లభించింది. పాత బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభం కాగా… * రు.8.5 కోట్లతో కొత్త వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
నయీంనగర్ బ్రిడ్జి కూల్చివేత
Warangal Naimnagar Bridge : వరంగల్ నగరంలో హనుమకొండ–కరీంనగర్ హైవేను కలిపే నయీంనగర్ బ్రిడ్జి(పెద్ద మోరీ) కూల్చివేత పనులు స్టార్ట్ అయ్యాయి. కొన్నేండ్ల కిందట కట్టిన బ్రిడ్జి కావడం, ప్రస్తుత వాహనాల రాకపోకలకు బ్రిడ్జి సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. అంతేగాకుండా ఎత్తు కూడా సరిపోకపోవడంతో ప్రతి వర్షాకాలంలో వరద నీటి ప్రవాహానికి కూడా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతోనే దాని స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు శుక్రవారం పాత బ్రిడ్జిని కూల్చివేసే పనులు ప్రారంభించారు. ఇటీవల రూ.250 కోట్లతో వరంగల్ నగరంలో వరద నివారణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క శ్రీకారం చుట్టగా.. అందులో రూ.8.5 కోట్లతో నిర్మించనున్న నయీంనగర్ బ్రిడ్జి(Naimnagar Bridge) పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పాత బ్రిడ్జిని జేసీబీలతో కూల్చే వేసే పనులు ప్రారంభించారు. జూన్ నెల నుంచి వర్షాలు ప్రారంభం కానుండగా.. ఆలోగానే కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. వచ్చే మూడు నెలల్లోగా పనులు పూర్తయితే హనుమకొండ ప్రాంతానికి వరద ముంపు సమస్య తీరిపోయే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మూడు నెలలు వాహనాల దారి మళ్లింపు
వరంగల్–కరీంనగర్ హైవే పై కీలకమైన నయీంనగర్ కొత్త బ్రిడ్జి పనులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. వరంగల్ సిటీ నుంచి కరీంనగర్ వైపు వెళ్లాలంటే ఇదే బ్రిడ్జి కీలకం కాగా.. ఈ మూడు నెలలు ఈ మార్గంలో వాహనాల రాకపోకలు బంద్ పెట్టారు. వాహనాలను ఇతర మార్గాల ద్వారా మళ్లించేలా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించేందుకు రూట్ మ్యాప్ విడుదల చేశారు.
1. కరీంనగర్ వైపు నుంచి ఖమ్మం, నర్సంపేట, వరంగల్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మగడ్డ, ఆటో నగర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
2. కరీంనగర్ వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు కేయూ జంక్షన్ నుంచి పెగడపల్లి డబ్బాలు, పెద్దమ్మ గడ్డ, ములుగు రోడ్డు జంక్షన్, అమృత జంక్షన్, హనుమకొండ చౌరస్తా మీదుగా బస్టాండ్ చేరుకోవాలి.
3. ఖమ్మం వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు ఉర్సుగుట్ట, కడిపికొండ, మడికొండ మీదుగా రింగ్ రోడ్డు ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది.
4. వరంగల్, నర్సంపేట వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్లాల్సిన భారీ వాహనాలు ఎంజీఎం ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూసీ జంక్షన్ మీదుగా కరీంనగర్ హైవే ఎక్కాలి.
5. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సులు హనుమకొండ చౌరస్తా, అమృత జంక్షన్, ములుగు రోడ్డు జంక్షన్, పెద్దమ్మ గడ్డ, పెగడపల్లి డబ్బాలు, కేయూ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
50 ఏళ్ల తరువాత కొత్త వంతెన సాకారం: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
నయీంనగర్ నాలాపై 50 ఏళ్ల తరువాత కొత్త వంతెన నిర్మిస్తున్నామని, దీంతో ఈ ప్రాంత ప్రజలకు వరద సమస్యలు తీరిపోనున్నాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. పాత బ్రిడ్జి కూల్చివేత పనులు ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. నయీంనగర్ నాలా ఆక్రమణకు గురి కావడంతో వర్షాకాలంలో ఇదివరకు హనుమకొండ సిటీ ఏరియా మునిగిపోయిందన్నారు. గత ప్రభుత్వం రెండు టర్మ్ లు అధికారంలో ఉండి కూడా నయీంనగర్ బ్రిడ్జ్ కు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే వరదల నివారణకు ప్రత్యేక నిధులు విడుదల చేయించినట్లు తెలిపారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ మొహమ్మద్ అజీజ్ ఖాన్, మాజీ డిప్యూటీ మేయర్ టి. అశోక్ రావు, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, చాడ స్వాతి రెడ్డి, వేముల శ్రీనివాస్, చీకటి శారదా ఆనంద్, మానస రాంప్రసాద్, మామిండ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.