CM Revanth Reddy Tour : సీఎం హోదాలో తొలిసారి వేములవాడకు రేవంత్ రెడ్డి, రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
20 November 2024, 6:41 IST
CM Revanth Reddy Vemulawada Tour : సీఎం రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి, రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎప్పుడెప్పుడా అని భక్తజనులంతా ఎదురుచూస్తున్న వేములవాడలో రోడ్డు వెడల్పుకు మోక్షం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుడుతున్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో బుధవారం పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం పర్యటనను సక్సెస్ చేసే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని వేములవాడకు మహార్దశ రానున్నదని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భక్తులకు మెరుగైన సేవలు
ఆధ్యాత్మిక కేంద్రం దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను సందర్శించే భక్తులకు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నడుం బిగించింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులతో వేములవాడను సందర్శించి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరిచే పనులకు భూమి పూజ చేయనున్నారు. ఉదయం పది గంటలకు వేములవాడకు చేరుకునే సీఎం, ముందుగా రాజరాజేశ్వరస్వామి దర్శించుకుని అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం రూ.76 కోట్లతో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలు కల్పించనున్నారు. ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం చుడతారు.
వేములవాడ పట్టణాభివృద్ధికి, దేవాలయ అభివృద్ధికి రూ.127 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. గల్ఫ్ సంక్షేమ నిధి నుంచి 15 మంది గల్ఫ్ బాధితులకు ఐదు లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. అనంతరం గుడి జాతర గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు. సీఎం హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి సమస్యలన్ని పరిష్కరించుకునే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.
కోర్కెలు నెరవేరేనా?
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కల వేములవాడ రాజన్నను దర్శించుకునే సీఎం రేవంత్ రెడ్డి, సమస్యల పరిష్కారానికి, రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల నేతన్నల సమస్యల పరిష్కారానికి వేములవాడ లో యార్న్ డిపో మంజూరు చేసిన ప్రభుత్వం అందుకు సంబంధించి పునాది రాయి సైతం వేయనున్నారు. మిడ్ మానేర్ నిర్వాసితులు ఎన్నో ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ఇళ్ళు, పరిహారం సమస్యకు పరిష్కార మార్గం చూపేలా ఇప్పటికే మిడ్ మానేర్ లో ముంపునకు గురైన 12 గ్రామాలకు చెందిన 4696 మందికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు ఇవ్వనున్నారు. అలాగే బతుకు దెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి వివిధ కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ వేములవాడ సిరిసిల్ల ప్రాంత ప్రజలకు గతంలో ఇచ్చిన హామీలు నెరవేరని వాటిపై రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు