Vemulawada : ఈనెల 20న వేములవాడకు సీఎం రేవంత్.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Vemulawada : సీఎం రేవంత్ సిరిసిల్ల జిల్లా పర్యటన ఖరారు అయింది. ఈనెల 20న వేములవాడ రాజన్నను దర్శించుకుని, పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఆది శ్రీనివాస్ జిల్లా అధికారులతో సమీక్షించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 19న వరంగల్ జిల్లాలో పర్యటించనున్న రేవంత్.. 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల, వేములవాడలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించారు.
రాజన్న ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం సందర్శించే ఛైర్మన్ గెస్ట్ హౌజ్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్‌లో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై సూచనలు చేశారు.
రోడ్డుకు మోక్షం..
సీఎం రేవంత్ మొదట సిరిసిల్లలోని కలెక్టరేట్ సమీపంలోని ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కొన్నేళ్లుగా బ్రిడ్జి నుండి దేవాలయం వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి నిర్మాణాలకు శ్రీకారంచుడతారు.
వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ఇటీవలే ఆలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతి అనుమతుల కోసం ఆలయ అధికారులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లి వచ్చారు. ఆలయంలో నిత్య నివేదనశాల, అభిషేక మంటపానికి శంకుస్థాపన చేయనున్నారు. బ్రిడ్జి నుండి దేవాలయం వరకు 80 ఫీట్ల రోడ్ల వెడల్పు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
పొన్నం ఫైర్..
దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ అభివృద్ధికి నోచుకోలేదని, గత పదేళ్లు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలిన వారు ఏం చేశారో చెప్పాలని.. మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బతికించిన వారికి అభినందనలు చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కలెక్టర్ మీద దాడి జరిగితే అరెస్టు కాకుండా ఏం చేయాలో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. ఏంపీగా ఉన్నప్పుడు సిరిసిల్ల చేనేత కార్మికుల కోసం మనోధైర్య యాత్ర చేశానని, ఇప్పుడు వారి ఆత్మహత్యల వార్తలు వినాల్సిన వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)