Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త.. రూ.127.65 కోట్లు మంజూరు-rs 127 crore sanctioned for development works of vemulawada temple ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త.. రూ.127.65 కోట్లు మంజూరు

Vemulawada : వేములవాడ రాజన్న భక్తులకు శుభవార్త.. రూ.127.65 కోట్లు మంజూరు

Basani Shiva Kumar HT Telugu
Nov 18, 2024 02:22 PM IST

Vemulawada : వేములవాడ.. దక్షిణ కాశీగా ఈ క్షేత్రానికి పేరుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కానీ.. భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధి భారీగా నిధులు మంజూరు చేసింది.

వేములవాడ
వేములవాడ (@spsircilla)

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు.. రూ.127.65 కోట్లు మంజూరు చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాల కల్పనకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్ల విస్తరణ కోసం రూ.47.85 కోట్లు, మూలవాగులోని బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.3.8 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సీఎం పర్యటన..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 20న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు ముందే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సీఎం‌ షెడ్యూల్ ఖరారు కావడంతో అధికారులు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల, వేములవాడలో పర్యటించి ఏర్పాట్లపై సమీక్షించారు.

రాజన్న ఆలయంలో చేయాల్సిన ఏర్పాట్లను జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు పరిశీలించారు. సీఎం సందర్శించే ఛైర్మన్ గెస్ట్ హౌజ్, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. సమావేశం జరిగే హల్‌లో విద్యుత్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేవంత్ రెడ్డి పర్యటించే ఎన్టీఆర్ అతిథి గృహంలో మార్పులు చేయాల్సిన అంశాలపై సూచనలు చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి మొదట సిరిసిల్లలోని కలెక్టరేట్ సమీపంలోని ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, కొన్నేళ్లుగా బ్రిడ్జి నుండి దేవాలయం వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి నిర్మాణాలకు శ్రీకారంచుడతారు.

వేములవాడ దేవస్థానం అభివృద్ధి కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. ఇటీవలే ఆలయ విస్తరణ కోసం శృంగేరి పీఠాధిపతి అనుమతుల కోసం ఆలయ అధికారులు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెళ్లి వచ్చారు. ఆలయంలో నిత్య నివేదనశాల, అభిషేక మంటపానికి శంకుస్థాపన చేయనున్నారు. బ్రిడ్జి నుండి దేవాలయం వరకు 80 ఫీట్ల రోడ్ల వెడల్పు కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.

Whats_app_banner