Osmania New Hospital : గోషామహల్ స్టేడియంలో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
02 December 2024, 5:39 IST
- Osmania New Hospital : హైదరాబాద్‌లోని గోషామహల్‌లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం గోషామహల్ పోలీస్ స్టేడియం, పోలీస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కలిపి దాదాపు 32 ఎకరాల స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు.
కొత్తగా ఉస్మానియా హాస్పిటల్
హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్, పరిసరాల అభివృద్ధి ప్రణాళికలను పరిశీలించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు. ఉస్మానియా ప్రస్తుత ఆసుపత్రిని అక్కడి నుంచి మార్చి.. గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు.
ఆసుపత్రికి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలని, రహదారుల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆ విషయంలో అన్ని శాఖలతో సమన్వయం కోసం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్‌ను నోడల్ అధికారిగా నియమించారు. ఆసుపత్రికి ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు.. అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
రాబోయే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని, అనుభజ్ఞులైన ఆర్కిటెక్టులతో డిజైన్లు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అక్కడికి చేరుకునే కనెక్టింగ్ రోడ్లను అభివృద్ధి చేయాలన్నారు. హాస్పిటల్ చుట్టూ నలు దిశలా రోడ్డు ఉండేలా డిజైన్ రూపొందించాలని రేవంత్ సూచించారు.
కొత్త ఆసుపత్రికి అవసరమైన అన్ని విభాగాలతో పాటు అకడమిక్ బ్లాక్, నర్సింగ్ ఉద్యోగులకు హాస్టళ్లు నిర్మించేలా ప్రణాళికలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కార్పొరేట్ తరహాలో వైద్య విభాగాలు, సేవలన్నీ అక్కడే అందుబాటులో ఉండాలని చెప్పారు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ భవనాలను చారిత్రక కట్టడాలుగా పరిరక్షించే బాధ్యతను చేపడుతామని రేవంత్ ఇటీవల స్పష్టం చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగంగా అక్కడున్న భవనాలను పర్యాటకులను ఆకట్టుకునే చారిత్రక భవనాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
గోషామహల్ స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు అప్పగించినందుకు.. పోలీసు విభాగానికి ప్రత్నామ్నాయ స్థలం కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పేట్లబుర్జులో ఉన్న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, సిటీ పోలీస్ అకాడమీ, చుట్టూ ఉన్న స్థలాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ను రేవంత్ ఆదేశించారు.