తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra Demolitions : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు..! ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

HYDRA Demolitions : 'హైడ్రా' పేరుతో బెదిరింపులు..! ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

29 August 2024, 14:41 IST

google News
    • Hydra Demolitions in Hyderabad : ‘హైడ్రా’ పేరుతో కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి అధికారులపై ఫోకస్ పెట్టాలని ఏసీబీతో పాటు విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఏసీబీ, విజిలెన్స్ విభాగాలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. నగరంలో ‘హైడ్రా’ పేరు చెప్పి భయపెట్టి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి స్పందించారు. అవినీతికి పాల్పడే అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

చర్యలు తప్పవు - సీఎం రేవంత్ 

గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అటువంటి వారిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇలాంటి వ‌సూళ్ల‌కు పాల్ప‌డే వారిపై ఫోక‌స్ పెట్టాల‌ని ఏసీబీ, విజిలెన్స్ అధికారుల‌ను అప్రమత్తం చేశారు.

మరోవైపు నగరంలోని దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై చర్యలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. బుధవారం అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు.. ఎనుముల తిరుపతి రెడ్డి ఇల్లు, కార్యాలయంతో సహా పలు ప్రముఖ నిర్మాణాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వాటిని 30 రోజుల్లోగా తొలగించాలని నోటీసులు అంటించారు.

రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. చెరువుకు ఆనుకుని ఉన్న నెక్టార్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు కూడా నోటీసులు జారీ చేశారు. వాల్టా చట్టంలోని సెక్షన్ 23(1) కింద ఈ నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని నిర్ణీత గడువులోగా స్వచ్ఛందంగా కూల్చివేయాలని ఆదేశించారు. లేదంటే అధికారులే కూల్చివేతలు చేపడతారని హెచ్చరించారు.

సీఎస్ కీలక ఆదేశాలు:

హైడ్రా కూల్చివేతలపై ఇటీవలే తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ శాఖ, నీటిపారుదల, వీఅండ్‌ఈ, ఏసీబీ, పోలీసు తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం సమీక్షించారు. చట్టవిరుద్ధమైన నిర్మాణాల కూల్చివేత ప్రక్రియను ప్రారంభించే ముందు హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.

నిబంధనల ప్రకారమే న్యాయస్థానం ముందుకెళ్లాలని చెప్పిందని.. ఇదే విషయాన్ని అన్ని విభాగాలు పాటించాలని సీఎస్ సూచించారు. ఈ కీలక సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ , సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో పాటు కీలక అధికారులు హాజరయ్యారు. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇక హైడ్రా మాదిరిగానే జిల్లాల్లోనూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే ‘హైడ్రా’ పరిమితమని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని తెలిపారు.  జంట జలాశయాలను పరిరక్షించడమే ప్రభుత్వ భాద్యత అని చెప్పుకొచ్చారు.

మొత్తంగా హైడ్రా కూల్చివేతలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి. ఎవరైనా వెనక్కి మాత్రం తగ్గేదేలే అని సీఎం రేవంత్ పదే పదే చెబుతున్నారు. కబ్జా జరిగితే కూల్చివేయాల్సిందనేని స్పష్టం చేశారు. మరోవైపు ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా కూడా అంతే దూకుడుగా ముందుకెళ్తోంది.

తదుపరి వ్యాసం