HYDRA : 'హైడ్రా' హైదరాబాద్‌ వరకే పరిమితం... పోలీస్‌ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తాం - సీఎం రేవంత్-cm revanth reddy key statement on hydra demolitions ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra : 'హైడ్రా' హైదరాబాద్‌ వరకే పరిమితం... పోలీస్‌ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తాం - సీఎం రేవంత్

HYDRA : 'హైడ్రా' హైదరాబాద్‌ వరకే పరిమితం... పోలీస్‌ స్టేషన్ స్టేటస్ కూడా ఇస్తాం - సీఎం రేవంత్

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 28, 2024 03:20 PM IST

ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే ‘హైడ్రా’ పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమని పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడిన ఆయన.. రుణమాఫీపై కూడా కీలక ప్రకటన చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైడ్రా పరిధిలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడిన ఆయన.. జంట జలాశయాలను పరిరక్షించడమే ప్రభుత్వ భాద్యత అని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే ‘హైడ్రా’ పరిమితమని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్ జోన్‌లో తన కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే వివరాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. తానే వచ్చి దగ్గర ఉండి కూల్చివేయిస్తానని కామెంట్స్ చేశారు.

హైడ్రా తన పని తాను చేసుకుపోతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు డ్రైనేజ్‌ను ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లోకి వదులుతున్నారని అన్నారు. ఆ నీళ్లు హైదరాబాద్‌ ప్రజలు తాగాలా.? అందుకే కూల్చివేతలు అని పేర్కొన్నారు. 'కేటీఆర్‌ ఫామ్‌హౌస్ లీజ్‌కు తీసుకున్నట్టు చెబుతున్నారు. లీజు విషయాన్ని అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదు…? కేటీఆర్‌ను డిస్‌క్వాలిఫై చేయాలి. హైడ్రాకు కూడా పోలీస్‌ స్టేషన్ స్టేటస్ ఇస్తాం" అని సీఎం రేవంత్ వెల్లడించారు.

వారికి కూడా నిధులు విడుదల చేశాం - సీఎం రేవంత్

రుణమాఫై అడిగిన ప్రశ్నలకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… అర్హత కలిగి ఉన్న ప్రతి రైతులకు మాఫీ జరుగుతుందని స్పష్టం చేశారు. "రూ.2 లక్షల పైన రుణం తీసుకున్న వారు పై మొత్తాన్ని కడితే రుణమాఫీ అయిపోతుంది. వాటికి నిధులు కూడా విడుదల చేశాం. హరీష్ రావు, కేటీఆర్ ప్రతి రైతు వద్దకి వెళ్లొచ్చు. రుణమాఫీ అవ్వని లెక్కలు సేకరించి కలెక్టర్ ఇవ్వొచ్చు. నాకు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌పై కూడా సీఎం రేవంత్ స్పందించారు. 16 నెలలు జైల్లో ఉన్న సిసోడియా, ఇంకా జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు రాని బెయిల్‌ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిందన్నారు. కవిత బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ ఎంపీ సీట్లు త్యాగం చేసిందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఒక న్యాయం, మిగితా వారికి మరో న్యాయం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు:

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఇంజినీరింగ్‌ కళాశాలలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. వీటిలో దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టారని ఇందులో పేర్కొన్నారు. స్థానిక ఎమ్మార్వో పేరు మీదు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

Whats_app_banner