AV Ranganath :జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్-hydra commissioner av ranganath clarified n convention center demolition nagarjuna allegations ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Av Ranganath :జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్

AV Ranganath :జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్

Bandaru Satyaprasad HT Telugu
Aug 24, 2024 06:23 PM IST

HYDRA AV Ranganath : హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తుమ్మడికుంట అక్రమ నిర్మాణాల్లో ఎన్ కన్వెన్షన్ ఒకటన్నారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును తప్పుదోవ పట్టిందని తెలిపారు.

జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్
జీహెచ్ఎంసీ అనుమతులు లేవు, హైకోర్టును తప్పుదోవ పట్టించారు-ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై ఏవీ రంగనాథ్ రియాక్షన్

HYDRA AV Ranganath : హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తుమ్మడికుంట ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ లోని అక్రమ కట్టడాలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బంది కూల్చివేసినట్లు తెలిపారు. తుమ్మడికుంటలోని అక్రమ నిర్మాణాల్లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ ఒకటన్నారు. ఎన్ కన్వెన్షన్ కు జీహెచ్ఎంసీ అనుమతులు లేవన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఎకరా 12 గుంటలు, బఫర్‌ జోన్‌ లో 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ ను అక్రమంగా నిర్మించారన్నారు. గతంలో బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం ప్రయత్నించిందన్నారు. అయితే బీఆర్ఎస్ అనుమతి ఇవ్వలేదన్నారు.

2014లో తుమ్మడికుంటపై హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఆ తర్వాత ఎన్ కన్వెన్షన్ హైకోర్టుకు వెళ్లిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. అయితే చట్టబద్ధంగా ఉండాలని కోర్టు తెలిపిందన్నారు. 2017లో ఎఫ్టీఎల్ సర్వేపై కేసు పెండింగ్ లో ఉందన్నారు. అంతేగానీ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించి ఏ కోర్టు స్టే ఇవ్వలేదన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పై ఎన్ కన్వెన్షన్ హైకోర్టును తప్పుదోవ పట్టిందని రంగనాథ్ తెలిపారు.

హైదరాబాద్ అంటేనే లేక్స్ , రాక్స్- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాగార్జున ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో చెరువులు ఆక్రమణకు గురికాకూడదనే ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేశామన్నారు. హైడ్రా ద్వారా చేపడుతున్న పనులను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. ప్రభుత్వం చేసే ప్రతి పనికి ముందుగా నోటీసులు ఇస్తుంది, ఆ తర్వాతే చర్యలు తీసుకుంటుందన్నారు. చెరువులను అక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తుందన్నారు. పదేళ్లలో చెరువుల ఆక్రమణలను శాటిలైట్‌ ఫొటోల గుర్తిస్తున్నామన్నారు. ప్రజల ఆస్తులు కాపాడటం ప్రభుత్వ బాధ్యత అన్నారు.

హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ న్నారు. వీటిని కాపాడుకోవాలని పర్యావరణవేత్తలు ఆందోళనలు కూడా చేశారన్నారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రకృతి విపత్తులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. చెరువులు ఆక్రమణకు గురికాకుండా పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

చెరువుల ఆక్రమణలపై కేటీఆర్ ను అరెస్టు చేయాలి- రఘునందర్ రావు

హైడ్రా కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. చెరువులను పరిరక్షించే ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోందని.. అదే నిజం అయితే ముందుగా బీఆర్ఎస్ నేతలు అక్రమ కట్టడాలను కూల్చివేయాలని ఎంపీ రఘునందన్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫామ్ హౌస్‌లు ఎందుకు కూల్చడంలేదని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ సెంటర్ ను కూల్చివేయాలని 2014లోనే హైకోర్టు ఆదేశించిందని రఘునందన్ రావు తెలిపారు.

అప్పుట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ వెనక లాలూచీ ఏంటో కేటీఆర్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణలపై కేటీఆర్‌ను నిందితుడిగా చేర్చి అరెస్టు చేయాలని ఎంపీ రఘునందర్ రావు డిమాండ్ చేశారు. చెరువుల పరిరక్షణకు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. దీనిపై హైకోర్టు ఎందుకు స్టే ఇస్తుందని ప్రశ్నించారు. కోర్టుకు పూర్తి వివరాలు అందించకుండా స్టే తెచ్చుకుంటున్నారన్నారు.

సంబంధిత కథనం