Nagarjuna N Convention : హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే-hyderabad high court interim orders to stop hero nagarjuna n convention demolition ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nagarjuna N Convention : హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే

Nagarjuna N Convention : హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టు స్టే

Bandaru Satyaprasad HT Telugu
Aug 24, 2024 03:29 PM IST

Nagarjuna N Convention : హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా ఈ భవనాన్ని కూల్చివేసింది.

హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
హీరో నాగార్జునకు బిగ్ రిలీఫ్, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

Nagarjuna N Convention : హీరో నాగార్జునకు హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్ మాదాపూర్ లో హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ కూల్చివేతలను ఆపాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

అసలేం జరిగింది?

హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతను తక్షణమే ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గండిపేట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుంది. ఈ నిర్మాణాలు రాజకీయ నాయకులు, ప్రముఖుల కావడంతో కూల్చివేతలు సంచలనంగా మారుతున్నాయి. తమ్మిడి చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా...శనివారం ఉదయం యాక్షన్ లోకి దిగింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని ఉన్న ఎన్ కన్వెన్షన్ భాగాన్ని కూల్చివేసింది.

హైడ్రా యాక్షన్

ఎన్ కన్వెన్షన్ సెంటర్ అక్కినేని నాగార్జునది కావడంతో సంచలనంగా మారింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత అక్రమమని హీరో అక్కినేని నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తాను పట్టా భూమిలోనే కన్వెన్షన్ సెంటర్ నిర్మించానని, ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు అక్రమంగా కూల్చివేతలు ప్రారంభించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. భారీ క్రేనులు, 200 మంది పోలీసుల బందోబస్తుతో హైడ్రా అధికారులు శనివారం ఉదయం ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా కూల్చివేశారని కోర్టుకు తెలిపారు.

2014లో కూల్చివేతపై స్టే

2014లో అప్పటి జలవనరుల శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కొలిచేందుకు ప్రయత్నించారని నాగార్జున కోర్టుకు తెలిపారు. ఎఫ్‌టీఎల్‌‌లో తన భవనం ఉందని అప్పటి అధికారులు కూల్చేందుకు రాగా హైకోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చిందన్నారు. అప్పుడు ఎఫ్‌టీ‌ఎల్‌, బఫర్ జోన్ నోటిఫై చేయలేదు కాబట్టి కూల్చే ముందు నోటీసులు జారీచేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. నాగార్జున పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు...కూల్చివేతలు ఆపాలని స్టే విధించింది. అయితే ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ భవనం పూర్తిగా నేలమట్టం అయ్యింది. దీనిపై ప్రభుత్వం కోర్టుకు ఏం చెబుతుంది. నాగార్జున ఎలా స్పందిస్తారో ఆసక్తిగా మారింది.

కూల్చివేతపై నాగార్జున స్పందన

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై స్పందించిన హీరో నాగార్జున అంతకు ముందు ప్రకటన విడుదల చేశారు. చెరువు భూమిని ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని స్పష్టం చేశారు. ఈ కూల్చివేతపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతకు ముందు ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదని.. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. కోర్టు తమకు వ్యతిరేకంగా తీర్పునిస్తే తామే కూల్చివేసేవాళ్లమని నాగార్జున వ్యాఖ్యానించారు.

Whats_app_banner

సంబంధిత కథనం