Vemulawada Temple : ఫిర్యాదుల వెల్లువ..! రాజన్న సన్నిధిలో ఏసీబీ సోదాలు
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ అధికారులతో పాటు తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిల్స్ సేకరించి రికార్డులు తనిఖీ చేశారు.
కోరిన కోర్కెలు తీర్చే కోడె మొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసిబి రైడ్స్ కలకలం సృష్టించాయి. ఏసీబీ అధికారులతోపాటు తూనికలు కొలతలు, పుడ్ సేఫ్టీ అధికారులు ఏకకాలంలో రాజన్న ఆలయ ప్రధాన కార్యాలయం, గోదాముల్లో తనిఖీలు నిర్వహించారు. అకౌంట్స్, లడ్డు తయారీ విభాగంలో లడ్డు ప్రసాదాల నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. గోదాముల్లో ముడి సరుకుల నిల్వలను పరిశీలించిన నాణ్యతను తనిఖీ చేశారు. రికార్డుల్లో నమోదైన వివరాలు, గోదాముల్లో ఉన్న నిల్వలను పరిశీలించి తూకం వేశారు. నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు శాంపిల్స్ సేకరించారు.
ఆరోపణల వెల్లువ...!
గత కొంతకాలంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఏసీబి డిఎస్పీ రమణమూర్తి తెలిపారు. లడ్డు ప్రసాదాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని, ముడిసరుకులు మాయం అవుతున్నాయని, కోడె టిక్కెట్లు రీ సేల్ అవుతున్నాయనే విమర్శలు ఆరోపణలు రావడంతో వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు ఏసిబి తోపాటు తూనికలు కొలతలు, పుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు ప్రకటించారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఏసిబి డిఎస్పీ రమణమూర్తి తెలిపారు.
గుబులు పుట్టించిన తనిఖీలు...
రాజన్న ఆలయంలో ఏకకాలంలో ఏసీబీతో పాటు మరో 2 విభాగాల అధికారులు తనిఖీలు నిర్వహించడంతో ఆలయ అధికారుల్లో గుబులు పుట్టింది. అసలు ఏం జరుగుతోందని ఆలయ ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. గుడికి వచ్చిన భక్తులు తనిఖీల పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరంతరం ఇలాంటి తనిఖీలు జరిగితేనే భయంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తారని అభిప్రాయపడ్డారు.