khairatabad ganesh 2024 : ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు
07 September 2024, 13:16 IST
- khairatabad ganesh 2024 : ఖైరతాబాద్ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ గణేశుడికి తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. అటు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.
ఖైరతాబాద్ గణేశుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలిపూజ
ఖైరతాబాద్ గణేశుడిని సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. సప్తముఖ వినాయకుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ స్వాగతం పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి.. మహాగణపతికి గజమాల, పండ్లు సమర్పించారు. వినాయకుని తొలిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, రోహిన్‌రెడ్డి, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని గణేష్ ఉత్సవ కమిటీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉత్సవాలపై ఇటీవల సమీక్ష..
గణేష్ నవరాత్రి ఉత్సవారలపై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరం తొలి నుంచి మత సామరస్యానికి, ప్రశాంతతకు పేరు పొందిందని వ్యాఖ్యానించారు. ఆ ఇమేజ్‌ను మరింత పెంచేలా గణేష్ ఉత్సవాల నిర్వహణ ఉండాలని, ఇందుకోసం ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
మండపాల ఏర్పాటు, తొమ్మిది రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించి మండప నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వం తరఫున పోలీసు, జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖతో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులు సైతం మండప నిర్వాహకులతో సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. నిమజ్జన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎటువంటి లోటుపాట్లకు తావు ఇవ్వొద్దని సీఎం హెచ్చరించారు.
పోలీసులు అలెర్ట్‌గా ఉండాలి..
గణపతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి గ్రేటర్ పరిధిలోని నలుగురు లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకోవాలని ముఖ్యమంత్రి పోలీసులకు చెప్పారు. సెప్టెంబరు 16న మిలాద్ ఉన్ నబి, 17న తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీలు పలు కార్యక్రమాలు చేపడతాయని.. అందువలన అన్ని కార్యక్రమాలకు సక్రమమైన ప్రణాళికతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ఎక్కడా ఎటువంటి సమస్య తలెత్తకుండా చూసుకోవాలని పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఉచిత విద్యుత్తు..
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ముందుగా మండప నిర్వాహకులు ఉచిత విద్యుత్ సరఫరాకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా విద్యుత్ వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని, జవాబుదారీతనం కోసమే అనుమతి చేసుకోవాలని కోరుతున్నామని చెప్పారు. మండపాల్లో డీజే సౌండ్లు వంటి అంశాల్లో సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ముందుకు వెళతామని ముఖ్యమంత్రి వివరించారు.