తెలుగు న్యూస్ / తెలంగాణ /
Khairatabad Ganesh : 70 ఏళ్లు... 70 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతి..! ముఖ్యమైన 10 విషయాలు
Khairatabad Ganesh 2024 : ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ భారీ గణేశ్ పూజలకు సిద్ధమయ్యాడు. గణేశ్ విగ్రహానికి ఇరువైపులా షెడ్డు కర్రలు తొలగించారు. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు గవర్నర్ చేతుల మీదుగా తొలిపూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రజలను దర్శనానికి అనుమతిస్తారు.
ఖైరతాబాద్ గణపతి (image source from @ddyadagirinews 'X')
Khairatabad Ganesh 2024 : భాగ్యనగరంలోని ఖైరతాబాద్మహా గణపతి ముస్తాబయ్యాడు. ఈసారి శ్రీసప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఇవాళ వినాయక చవితి కావటంతో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తొలి పూజ నిర్వహించనున్నారు. ఆ తర్వాత భక్తుల దర్శనం ప్రారంభం కానుంది.
తొమ్మిదిరోజుల పాటు భక్తుల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి పూజలను అందుకోనున్నాడు. భక్తులు భారీ సంఖ్యలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాళ పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
ఖైరతాబాద్ మహా గణపతి - 10 ముఖ్యమైన విషయాలు:
- ఖైరతాబాద్ గణేశుడికి ఎంతో చరిత్ర, ప్రత్యేకత ఉంది. మొదటిసారిగా 1954లో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్‌లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వతా ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు.
- ఈ ఏడాది(2024) 70 అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు. పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు.
- 70 అడుగులు భారీ వినాయకుడి కోసం 1000 బ్యాగుల మట్టి,18 టన్నుల ఇనుము, 2వేల మీటర్ల కాటన్ క్లాత్, మరో 2 వేల మీటర్ల జూట్క్లాత్ ను ఉపయోగించారు.
- ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్.. గణపతికి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోశారు. ఆ తర్వాత ఉత్సవ కమిటీ వారు… గుమ్మడికాయలు, కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు.
- విగ్రహానికి 7 ముఖాలు ఉన్నాయి. ఓ వైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దర్శనమిస్తారు. మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి, మధ్య గణపతిని తీర్చిదిద్దారు.
- ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముడిని గణపతికి కుడివైపున 12 అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు.
- ఉత్సవ కమిటీ మొదటిసారిగా ‘ఆగమన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. స్థానిక యువకులు, భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
- నిర్జల ఏకాదశి నాడు ఖైరతాబాద్ మహాగణపతి పనులు మొదలుపెట్టారు. మొత్తం 78 రోజుల్లో ప్రతిమ సిద్ధం చేశారు.
- ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
- ఇవాళ్టి నుంచి ఖైరతాబాద్ విశ్వేశ్వరాయ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింట్ కాంపౌండ్ వైపు సాధారణ ట్రాఫిక్‌ను అనమతించరు. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్ మీదుగా బడా గణేష్ దర్శనానికి వచ్చే సందర్శకులు తమ వాహనాలను ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ పక్కన అంబేద్కర్ స్క్వేర్ పార్కింగ్ స్థలంలో, ఎన్టీఆర్ గార్డెన్ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకోవాలి. సరస్వతి విద్యా మందిర్ హైస్కూల్ ప్రాంగణం, రేస్ కోర్స్ రోడ్ పార్కింగ్ ప్లేస్‌లోనూ వాహనాలను పార్క్ చేసుకోవచ్చని సూచించారు.
సంబంధిత కథనం