Cantonment Assembly Seat : కంటోన్మెంట్ బైపోల్ ఉంటుందా..? ఉండదా...?
24 February 2023, 5:55 IST
- Telangana Election News: అనారోగ్యంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవటంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతుందా..? లేదా..? అన్న చర్చ మొదలైంది. మరోవైపు ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనే అంశంపై జోరుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కంటోన్మెంట్ బైపోల్ ఉంటుందా..? ఉండదా...?
Bypoll in Telangana: తెలంగాణలో ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆ దిశగా రాజకీయపార్టీలు అడుగులు వేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ మరోసారి గెలవాలని చూస్తుంటే... ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా కుర్చీపై కన్నేశాయి. ఈసారి కేసీఆర్ ను దెబ్బకొట్టాలని చూస్తున్నాయి. ఇదిలా ఉండగా.... హైదరాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ ఎమ్మెల్యే అనారోగ్యంతో చనిపోయారు. ఫలితంగా ఈ సీటు ఖాళీగా మారినట్లు అయింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బైపోల్ వస్తుందా? రాదా? అన్న అంశం పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది.
గతేడాదే తెలంగాణలో మునుగోడు ఉపఎన్నిక జరిగింది. రాష్ట్రంలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రకారం చూస్తే... ఇక్కడ జరిగే చివరి ఉపఎన్నిక మునుగోడే అవుతుందనే అభిప్రాయాలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే సాయన్న చనిపోయిన నేపథ్యంలో... మరోసారి బైపోల్ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నిబంధనల ప్రకారం సాధారణంగా పార్లమెంట్ సభ్యుడు లేదా ఎమ్మెల్యే చనిపోయినా లేదా రాజీనామా చేసినా ప్రజాప్రాతినిధ్య చట్టం 151ఏ ప్రకారం 6 నెలల్లోపు ఉపఎన్నిక నిర్వహిస్తారు. ఈ లెక్కన చూస్తే... దీని ప్రకారం ఆగస్టు 20లోపు కంటోన్మెంట్ ఉపఎన్నిక నిర్వహించాలి. మే నెల కంటే ముందే జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఉప ఎన్నిక కూడా నిర్వహించవచ్చు. కానీ తెలంగాణ శాసనసభ గడువు ఈ ఏడాది డిసెంబరుతో ముగుస్తుంది. అంటే గడువు మరో 10 నెలలు మాత్రమే ఉంది.
అసెంబ్లీ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో బైపోల్ జరిగే అవకాశం లేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఈసీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఉపఎన్నిక నిర్వహించిన సందర్భాలు కూడా పెద్దగా లేవు. అయితే ఉపఎన్నిక నిర్వహించటమా..? లేదా..? అనే దానిపై తుది నిర్ణయం మాత్రం ఎన్నికల సంఘమే ప్రకటిస్తుంది. ఒకవేళ ఉపఎన్నికకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం... తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికలకు రెఫరెండమే అన్నట్లు ఉంటుంది. ఫైనల్ గా ఎన్నికల సంఘం.... ఈ సీటు విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన చేస్తుందో చూడాలి….!