Assembly Session after Elections : ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు… కారణం అదే-andhra pradesg assembly sessions will start after mlc elections and ugadi festival ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Assembly Session After Elections : ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు… కారణం అదే

Assembly Session after Elections : ఎన్నికల తర్వాతే అసెంబ్లీ సమావేశాలు… కారణం అదే

HT Telugu Desk HT Telugu
Feb 21, 2023 08:44 AM IST

Assembly Session after Elections ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు మండలి ఎన్నికలు పూర్తైన జరిగే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాలను ఫిబ్రవరి నెలాఖరు నుంచి నిర్వహిస్తారని ప్రచారం జరిగినా మండలి ఎన్నికలు పూర్తైన తర్వాతే సమావేశాలు నిర్వహిస్తారని మరో ప్రచారం తెరపైకి వచ్చింది.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జాప్యం అందుకేనా....?
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో జాప్యం అందుకేనా....?

Assembly Session after Elections ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆలశ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మండలి ఎన్నికల హడావుడి మొదలు కావడంతో అవి పూర్తైన తర్వాతే సమావేశాల నిర్వహణ చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని మొదట ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 27 నుంచి సమావేశాలు ప్రారంభిస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది.

అనివార్య కారణాలతో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వెనక్కి జరిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్ని వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మండలిలో ఖాళీ అయిన స్థానాలతో పాటు త్వరలో ఖాళీ అయ్యే స్థానాలను కూడా భర్తీ చేసేందుకు ఇప్పటికే పేర్లను ఖరారు చేశారు. ఎన్నికలు పూర్తైతే శాసన మండలిలో వైసీపీకి ఎదురు లేకుండా పోతుంది. దాదాపుగా ప్రతిపక్షమే లేకుండా పోతుంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజక వర్గాల్లో గెలుపు కోసం వైసీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా పోటీ లేదు. అన్ని కలిపి 23 స్థానాలను దక్కంచుకోడానికి వైసీపీ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన వెంటనే ఎన్నికల సన్నహకాల్లో భాగంగా వైసీపీ ఏర్పాటు చేసిన గృహ సారథుల శిక్షణ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. ఇవి పూర్తైన తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే అది సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. దీంతో ప్రతి ఎమ్మెల్సీ స్థానంలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రధానంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఆ స్థానాలను దక్కించుకోలేకపోతే పరువు పోతుందని భావిస్తోంది. అందుకే ఉపాధ్యాయ ఎమ్మెల్సీల గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై కూడా అభ్యర్థుల్లో ఎంతోకొంత ఆందోళన ఉంది. ప్రధానంగా ఉపాధి అవకాశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సీతంరాజు సుధాకర్‌, ప్రకాశం , నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి సత్యప్రసాద్ రెడ్డి, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల నుంచి జి.రవిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా ప్రకటించారు.

ఏ ఒక్క స్థానంలో పార్టీ ఓడినా అది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని వైసీపీ భావిస్తోంది. వచ్చే నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యేలు, మంత్రులు అభ్యర్థుల గెలుపుపైనే పనిచేయాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టంగా ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తైన తర్వాత మార్చి 18 నుంచి 26వ రకు గృహ సారథులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలను ఈ కార్యక్రమాల్లో భాగం కావాలని సిఎం ఆదేశించారు. మార్చి 22న ఉగాది జరుగనుంది. దీంతో 26 తర్వాత అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తారని చెబుతున్నారు.

అసలు విషయం అదేనా….

అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేయడానికి మరో కారణం కూడా తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి మూడేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రకరకాల అవాంతరాలు ఎదరవుతూనే ఉన్నాయి.

మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సిఆర్‌డిఏ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో సవాలు చేశారు. దానిపై విచారణ జరుగుతోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టులో ఊరట దక్కుతుందని ఏపీ ప్రభుత్వం గంపెడాశలతో ఉంది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చట్టబద్దంగా విశాఖ వెళ్లాలనే ఆలోచన కూడా ప్రభుత్వంలో లేకపోలేదు. విమర్శలకు తావు లేకుండా న్యాయస్థానం అనుమతితోనే విశాఖ వెళుతున్నట్లు ప్రచారం చేసుకోవచ్చు. అదే సమయంలో శాసనసభతో పాటు, మండలిలో ప్రభుత్వం అనుకున్న బిల్లులను ప్రవేశపెట్టి నెగ్గించుకోవచ్చు. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యాక సమావేశాలు నిర్వహిస్తే అన్ని విధాలుగా అనువుగా ఉండటంతో పాటు అన్ని వ్యవహారాలు చక్కబెట్టడానికి కాస్త సమయం దొరుకుతుందని వైసీపీ భావిస్తోంది.

IPL_Entry_Point