Secunderabad Contonment : కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు మోగిన నగారా
Secunderabad Contonment :సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు (ఎస్సీబీ) ఎన్నికల నగారా మోగింది. ఎస్సీబీతో పాటు దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డులకి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర రక్షణ శాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
Secunderabad Contonment : రాష్ట్రంలో మరో కీలక ఎన్నికకు నగారా మోగింది. ఏడాదిగా నామినేటెడ్ సభ్యుల ద్వారా పాలన సాగిస్తున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి (Secunderabad Contonment Board) .. ఎన్నికల షెడ్యూల్ ని కేంద్రం ప్రకటించింది. ఎన్నికల తేదీని ప్రకటిస్తూ రక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. సికింద్రాబాద్ తో పాటు.. దేశవ్యాప్తంగా 57 కంటోన్మెంట్ బోర్డులకి ఎన్నికల తేదీలను రక్షణశాఖ శనివారం (ఫిబ్రవరి 18న) ఖరారు చేసింది. అన్ని కంటోన్మెంట్ బోర్డులకి ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు - ఎస్సీబీ పరిధిలో 8 వార్డులు ఉన్నాయి. రక్షణ శాఖ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో... అధికారులు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొదలు పెట్టనున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాపై బోర్డు అధికార యంత్రాంగం కసరత్తు ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.
2015లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఆ ఏడాది ఫిబ్రవరి 10న పాలకవర్గం కొలువుదీరింది. 2020 ఫిబ్రవరి 10 నాటికి పాలకవర్గం గడువు తీరింది. అనంతరం కేంద్రం నామినేటెడ్ సభ్యుడిని నియమించింది. అయితే, బోర్డుకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీనిపై స్పందించాలని కోర్టులు కూడా కంటోన్మెంట్ బోర్డును పలుమార్లు ఆదేశించాయి. ఈ క్రమంలోనే కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు విధి విధానాలపై కొన్నిరోజుల కిందట కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విలీన ప్రక్రియ ఊపందుకుంటుందనుకున్న తరుణంలో తాజాగా బోర్డు ఎన్నికల అంశం తెరపైకి రావడం గమనార్హం.
దేశంలో ఉన్న కంటోన్మెంట్లలో అతిపెద్దది సికింద్రాబాద్‌లోనే ఉంది. బేగంపేట విమానాశ్రయం... ఆర్మీ ఆంక్షలతో కంటోన్మెంట్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగలేదన్న వాదన ఉంది. కంటోన్మెంట్ బోర్డు వద్ద కూడా తగినన్ని నిధులు లేక.... రోడ్ల విస్తరణ, మౌళిక సదుపాయాల కల్పనపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈ క్రమంలోనే... స్థానికుల నుంచి జీహెచ్ఎంసీలో విలీనానికి సుదీర్ఘ కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనానికి అభ్యంతరం లేదని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
జీహెచ్ఎంసీలో ఎస్సీబీ విలీనం జరిగితే దాదాపు 3 వేల ఎకరాల కంటోన్మెంట్ ల్యాండ్ బల్దియా పరం అవుతుంది. జంటనగరాల్లోని నడిబొడ్డున ఉండటంతో మార్కెట్ విలువ కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎస్సీబీ అధికారిక లెక్కల ప్రకారం కంటోన్మెంట్ బోర్డు 40 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉంది. ఎస్సీబీ ట్రాన్స్‌ఫర్ ల్యాండ్‌లో జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్లు, స్కైవేలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, ట్రాఫిక్ జంక్షన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఆటంకాలు ఉండవు. అయితే... విలీనానికి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రం... అనూహ్యంగా బోర్డు ఎన్నికలకి షెడ్యూల్ విడుదల చేయడం... అనేక సందేహాలకు తావిస్తోంది.