తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr On Revanth Reddy : అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు-కేటీఆర్

KTR On Revanth Reddy : అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు-కేటీఆర్

11 November 2024, 21:09 IST

google News
  • KTR On Revanth Reddy : అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావమరిదికి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని కేటీఆర్ ఆరోపించారు. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను దిల్లీలో కేటీఆర్ కలిసి ఫిర్యాదు చేశారు.

అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు-కేటీఆర్
అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు-కేటీఆర్

అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి, బావమరిది కంపెనీకి రూ.1137 కోట్ల పనులు-కేటీఆర్

అమృత్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించి తన బావమరిది సుజన్ రెడ్డికి చెందిన శోధా కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని ఆరోపించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న ఓకే ఒక్క కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెట్టారన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తన బావమరిది కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు అప్పజెప్పారన్నారు. అమృత్ 2.0 స్కీం లో భాగంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వివిధ పనులకు గాను దాదాపు రూ. 8,888 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ స్కీం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ నేతృత్వంలో ఉండటంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను దిల్లీలో కేటీఆర్ సోమవారం కలిశారు. అమృత్ టెండర్లలో సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అవినీతికి పాల్పడ్డారో...ఆధారాలతో సహా కేంద్రమంత్రికి వివరించారు. మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని ఈ టెండర్లపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

రూ.2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులా?

అమృత్ టెండర్లలో భాగంగా రూ. 1,137 కోట్ల పనులు దక్కించుకున్న సీఎం బావమరిది కంపెనీ శోధా ఇన్ ఫ్రాక్చర్ లిమిటెడ్ 2021-2022 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ. 2 కోట్ల 20 లక్షల లాభాన్ని మాత్రమే చూపించిందన్నారు. అలాంటి కంపెనీకి రూ. 1,137 కోట్ల పనులు ఎలా అప్పజెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని కంపెనీకి ఇన్ని కోట్ల పనులు అప్పగించారంటేనే తెర వెనుక భారీ అవినీతి బాగోతం జరిగిందన్నది అర్థమవుతోందన్నారు. మొత్తం రూ. 1137 కోట్ల పనుల్లో ఇండియన్ హ్యూమ్ పైప్స్ కో. లిమిటెడ్ అనే కంపెనీకి 20 శాతం పనులు, మిగతా 80 శాతం పనులను శోధా సంస్థ చేసేలా ఒప్పందం చేసుకున్నారని కేటీఆర్ అన్నారు. మొత్తం ప్రాజెక్ట్ లో 80 శాతం పనులను సీఎం బావమరిది కంపెనీ కావటంతోనే ఇండియన్ హ్యూమ్ పైప్స్ లిమిటెడ్ సంస్థ శోధా సంస్థకు అప్పగించిందని చెప్పారు. అమృత్ టెండర్లకు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ శాఖకే అధికారం ఉన్నందున పురపాలక శాఖ మంత్రిగానూ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కచ్చితంగా ఈ టెండర్లను బావమరిదికి అప్పగించటం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని కేటీఆర్ విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపించి, అక్రమాలు జరిగితే టెండర్లను రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధన ఉల్లంఘన

సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లంఘించారని కేటీఆర్ అన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన చాలా శక్తివంతమైనదని...ఈ నిబంధనను ఉల్లంఘించిన ఎంతటి ప్రజా ప్రతినిధులపై నైనా వేటు వేయవచ్చని చెప్పారు. ఇందుకు సంబంధించి పలు కేసులను కూడా కేటీఆర్ ఉదాహరించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ గనుల కేటాయింపు, బిహారిలాల్ దోబ్రే వర్సెస్ రోషన్ లాల్ దోబ్రే కేసు (1983), ది శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వర్సెస్ వైరిచెర్ల ప్రదీప్ కుమార్ దేవ్ కేసు (2005), ది జయా బచ్చన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2001), దివ్య ప్రకాష్ వర్సెస్ కులతార్ చంద్ రాణా (2003) కేసులను కేటీఆర్ ప్రస్తావించారు. 2014లో సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించిందో ల్యాండ్ కేటాయింపులు చేసిందో...పొరుగున ఉన్న కర్ణాటకలో ముడా స్కాంలో ఏ విధంగా అక్కడి సీఎం యడ్యూరప్ప తన భార్యకు భూములు కేటాయించారో అదే విధంగా రేవంత్ రెడ్డి అమృత్ టెండర్లలో తన బావమరిదికి మేలు చేశారని కేటీఆర్ ఆరోపించారు.

ముఖ్యమంత్రే అవినీతికి పాల్పడితే

రాష్ట్రంలో అధికారులు, మంత్రులు అవినీతికి పాల్పడితే ముఖ్యమంత్రికి నివేదిస్తారు. దాని ఆధారంగా ఆయన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కానీ కంచె చేను మేసిందన్నట్లుగా ఇక్కడ ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డియే అవినీతికి పాల్పడటం అనైతికమన్నారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను మాత్రమే కాకుండా టెండర్ కేటాయింపుల్లోనూ అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణలో సీఎం ఏ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి తన కుటుంబ సభ్యులకు మేలు చేస్తున్నారో ఆ అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నానని కేంద్రమంత్రికి వివరించారు.

పారదర్శకంగా విచారణ జరిపించండి

అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమేనని కేటీఆర్ అన్నారు. సీఎం అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. అధికార దుర్వినియోగం, అవినీతి నిరోధక చట్టాలను ఉపయోగించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు. అమృత్ టెండర్లలో చట్టవిరుద్దంగా కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిజమని తేలితే టెండర్లను రద్దు చేసి సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

తదుపరి వ్యాసం