తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr Challenge: సిరిసిల్లపై కక్షగడితే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానన్న Ktr, నేతన్న ఆత్మహత్యలపై ఆవేదన

KTR Challenge: సిరిసిల్లపై కక్షగడితే ఎమ్మెల్యే పదవి నుంచి తప్పుకుంటానన్న KTR, నేతన్న ఆత్మహత్యలపై ఆవేదన

HT Telugu Desk HT Telugu

11 November 2024, 7:50 IST

google News
    • KTR Challenge: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎమ్మెల్యే పదవిని వదులుకునేందుకు సిద్ధపడ్డారు. సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవడానికి తాను అడ్డంకి అనుకుంటే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
సిరిసిల్ల నేత కార్మికుల పిల్లల్ని పరామర్శిస్తున్న కేటీఆర్
సిరిసిల్ల నేత కార్మికుల పిల్లల్ని పరామర్శిస్తున్న కేటీఆర్

సిరిసిల్ల నేత కార్మికుల పిల్లల్ని పరామర్శిస్తున్న కేటీఆర్

KTR Challenge: తనపై కోపంతో మంచిగా నడిచిన వస్త్రపరిశ్రమపై పగబట్టినట్టు, కక్షగట్టినట్టు ప్రవర్తించడం ప్రభుత్వానికి మంచిది కాదని కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల గడిచిన 11 మాసాల్లో ఒక్క సిరిసిల్లలోనే 20 మంది నేతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారని ఆరోపించారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనగర్ లో ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఆత్మహత్య చేసుకున్న నేతన్న దంపతులు బైరి అమర్ - స్రవంతి కుటుంబాన్ని మాజీమంత్రి కేటిఆర్ తోపాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.

తల్లిదండ్రుల బలవన్మరణంతో అనాధలైన ముగ్గురు పిల్లలను చూసి కేటిఆర్ చలించిపోయారు. పది, ఏడు, ఐదో తరగతి చదువుతున్న ముగ్గురు పిల్లలను అక్కున చేర్చుకుని తన పిల్లల మాదిరిగా చూసుకుంటానని హామి ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు లక్షల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. పిల్లల చదువులకయ్యే ఖర్చులను తానే స్వయంగా భరిస్తానని.. ధైర్యంగా ఉండి చదువుకోవాలని కోరారు.‌

రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్ లో మాట్లాడి వస్త్ర సంక్షోభంతో పవర్ లూమ్ పరిశ్రమ సరిగా నడవక నేతన్న దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ పరంగా వారి ముగ్గురు ఆదుకోవాలని కోరారు.

11 నెలల్లో 34 మంది సూసైడ్

కాంగ్రెస్ ప్రభుత్వం పొడిచిన వెన్నుపోటు కారణంగా గడిచిన 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. అందులో ఒక్క సిరిసిల్లలోనే 20 మంది బలవన్మరణానికి పాల్పడ్డారని చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు, ప్రభుత్వ ఆర్డర్స్ ఇచ్చి నేతన్నకు వెన్నుదన్నుగా ప్రభుత్వ నిలిచిందని, ప్రస్తుతం ఎలాంటి ఆర్డర్లు లేక సాంచలు నడవక వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడి నేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు.

సిరిసిల్లపై సర్కార్ కు కక్ష ఎందుకు?

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కాంగ్రెస్ సర్కార్ కు పగ, కోపం ఎందుకని కేటిఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లకు తాను ఎమ్మెల్యేగా ఉండడంతోనే సిరిసిల్ల ప్రజల మీద ప్రభుత్వానికి ప్రేమ కలగకపోతే... ఎమ్మెల్యే పదవిని వదిలేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు. మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిని కోరుతున్నా.. మీకు సిరిసిల్ల మీద నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడమే మీకు అడ్డంకిగా ఉంటే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. రేపు పొద్దున్నే ఫస్ట్ అవర్ లో ఎమ్మెల్యే పదవిని వదిలేయడానికి సిద్దంగా ఉన్నానని తెలిపారు.

ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం

సిరిసిల్లకు న్యాయం చేసేదాకా వదిలిపెట్టం...ప్రత్యక్ష పోరాటానికైనా దిగుతామని కేటిఆర్ తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం నవంబర్ పదో తారీఖున.. కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ తో కాంగ్రెస్ అందమైన రంగుల కలను చూపించిందని తెలిపారు. బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని, 42 % రిజర్వేషన్ కల్పిస్తామని కులవృత్తులను ఆదరిస్తామని సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి ఇప్పటికీ ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి ప్రయత్నించాలని కేటిఆర్ డిమాండ్ చేశారు. లేనిచో ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచకతప్పదని హెచ్చరించారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం