BRS MLA Meet CM Revanth : సీఎం రేవంత్ తో భద్రాచలం ఎమ్మెల్యే భేటీ..! BRSకి షాక్ ఇస్తారా..?
03 March 2024, 12:56 IST
- BRS MLA Tellam Venkat Rao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటితో కలిసి సీఎంను కలవటం ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే
BRS MLA Tellam Venkat Rao : సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని సీఎం రేవంత్ నివాసంలో… కుటుంబ సమేతంగా కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి వెంకట్రావు సీఎం రేవంత్ దగ్గరకు వెళ్లారు. ఈ భేటీతో ఆయన పార్టీ మారుతారనే చర్చ జోరందుకుంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీనే అని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అంటున్నారు.
ఏకైక ఎమ్మెల్యే….
తెల్లం వెంకట్రావు… 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. భద్రాచలంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నిజానికి తెల్లం వెంకట్రావు… మంత్రి పొంగులేటి అనుచరుడిగా ఉన్నారు. ఎన్నికల కంటే ముందే పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో వెళ్లినప్పటికీ… తిరిగి బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
బీఆర్ఎస్ నుంచి గెలిచి వెంకట్రావు… కాంగ్రెస్ లోకి వెళ్తారనే చర్చ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఫలితాలు వచ్చిన కొద్దిరోజులకే పాత ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీటిని ఖండించారు వెంకట్రావు. అయితే తాజాాగా కుటుంబసమేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే ఇందులో మంత్రి పొంగులేటి ఉండటంతో… పార్టీ మార్పుపై ఊహాగానాలు మరోసారి మొదలయ్యాయి. అయితే వీటిని కూడా వెంకట్రావు కొట్టిపారేస్తున్నట్లు తెలిసింది. కేవలం నియోజకవర్గ సమస్యలపై కలిశానని చెప్పినట్లు సమాచారం.
కొద్దిరోజుల కిందటే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేతో పాటు మేయర్ కూడా సీఎంను కలిశారు. ఈ టైమ్ లో కూడా పార్టీ మార్పు వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే ఈ వార్తలను సదరు ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. కేవలం తమ తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆపరేషన్ ఆకర్ష్ కు పదునుపెట్టే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రం నుంచి మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని గట్టిగా భావిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎంపీలు… బీజేపీలో చేరుతున్నారు. ఈ క్రమంలో… ఎమ్మెల్యేలు కూడా ఇదే దారిలో నడుస్తారా అన్న చర్చ వినిపిస్తోంది.
మరోవైపు లోక్ సభ అభ్యర్థులపై బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తోంది. ఏ క్షణమైనా పలు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.