తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Opinion: తెలంగాణ కమలం పగటి కలలు కంటోందా?

Opinion: తెలంగాణ కమలం పగటి కలలు కంటోందా?

HT Telugu Desk HT Telugu

15 June 2024, 10:45 IST

google News
    • లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీ పట్ల పెరుగుతున్న ప్రజాదరణకు సంకేతం. అయితే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుచుకునేందుకు ఇది దోహదపడుతుందా? కమలనాథులు మార్చుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటి? పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ పొలిటికల్ అనలిస్ట్ ఐవీ మురళీకృష్ణ శర్మ విశ్లేషణ.
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ (BJP Telangana - X)

ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కిషన్ రెడ్డి, బండి సంజయ్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే 2019-2023 గుర్తుకొస్తుంది. అప్పుడు వాస్తవికతను విస్మరించి ఊహాలోకంలో విహరించిన బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు ఇప్పుడు ఈ నేతల ప్రకటనలు గమనిస్తే వారు నేల విడిచి సాము చేస్తున్నట్టు ఉంది.

సైద్ధాంతిక పునాదులతో ఏర్పడ్డ బీజేపీలో ప్రస్తుతం విరుద్ధమైన భావజాలం గల నేతల వలసలతో ఆ పార్టీ తెలంగాణలో లక్ష్యం చేరుకోవడం అంత సులువైన పని కాదు. రాష్ట్రంలో అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు బహిరంగ రహస్యమే. ఇది మరిచి పగటి కలలు కంటే సరిపోదు. వాస్తవాలు గ్రహించకపోతే మరోసారి బొక్కబోర్లా పడక తప్పదు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు గెల్చిన బీజేపీ 2023లో 75 స్థానాలతో రాష్ట్రంలో అధికారం చేపడుతామని దూకుడుగా ప్రవర్తించి బొక్కబోర్లా పడింది. ఇప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు గెల్చిన బీజేపీ 2028లో 88 స్థానాలతో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని మరింత దూకుడుగా ప్రకటనలు చేస్తోంది.

సంస్థాగత అభివృద్ధి ఏది?

బీజేపీ ప్రకటనలలో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తే వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుత, గత ఎన్నికల ఫలితాలను అధ్యయనం చేస్తే తెలంగాణలో ఆ పార్టీ ఎంత వేగంగా లేస్తుందో అంతే వేగంగా చతికిలపడుతోంది. ఇందుకు ప్రధాన కారణం పార్టీ అభివృద్ధికి నిబద్ధతతో శ్రమించే వారు దూరమవడమే.

తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసి పునాదులు వేసిన సంఘ్ పరివార్ అండదండలు పార్టీకి ఇప్పుడు గతంలో వలే లభించడం లేదు. దీనికి ప్రధాన కారణం తెలంగాణ బీజేపీ స్వయంకృపారాధమే. పార్టీ భావజాలాన్ని నమ్ముకొని మొదటి నుండి ఉన్నవారిని కాదని అరువు తెచ్చుకున్న నేతలను బీజేపీలో అందలమెక్కిస్తుండడంతో కార్యకర్తలు, సానుభూతిపరులు అసంతృప్తితో ఉన్నారు.

ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, ఏబీవీపీ ఇతర అనుబంధ సంఘాల్లో పనిచేసి బీజేపీలోకి వచ్చినవారికి ప్రాధాన్యత లభించకపోవడంతో పాటు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతల పెత్తనం పెరిగిపోవడంతో సంఘ్ సభ్యులు పార్టీకి దూరమవుతున్నారు.

లోగడ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేయగా 90 టికెట్లు ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలకే ఇచ్చినా ఆశించిన ఫలితాలు పొందలేక 8 స్థానాల్లోనే గెలిచింది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీల నుండి చివరి నిమిషంలో బీజేపీలో చేరి పోటీ చేసిన బీబీ.పాటిల్, పి.భరత్, సైదిరెడ్డి, గోమాస శ్రీనివాస్, సీతారాం నాయక్, ఆరూరి రమేశ్ ఓడిపోయారు.

ఎన్నికలలో విజయమే లక్ష్యంగా మొదటి నుండి పనిచేసుకుంటూ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న ఎనిమిది మంది ఎంపీలుగా గెలిచారు. మొదటి నుండి పార్టీని నమ్ముకొని ఉన్న వారిని కాదని అరువు తెచ్చుకున్న నేతలకు టికెట్లు ఇవ్వడంతో బీజేపీ మరో రెండు స్థానాలలో గెలుపు అవకాశాలను పోగొట్టుకుంది.

అవకాశవాద రాజకీయాలతో చేటు

వలస వచ్చిన నేతలతో పార్టీకి ప్రయోజనం కలుగుతుందనే భావన ఒక భ్రమ మాత్రమే. బీజేపీ కార్యాలయం గడప కూడా తొక్కనివారికి నేరుగా టికెట్ ఇస్తే వారు పార్టీ భావజాలం కంటే సొంత బాగోగులకే ప్రాధాన్యతిస్తారు. ఆ నేతలు గెలిస్తే పదవులు అనుభవిస్తూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు. ఓడితే పార్టీ వైపు కన్నెత్తి చూడకుండా మరో అవకాశం కోసం ఇతర పార్టీల వైపు చూస్తారు. అవకాశవాదంతో వచ్చిపోయే ఇలాంటి నేతలతో పార్టీకి మేలు కంటే చెడే ఎక్కువ జరుగుతున్నా పార్టీ అగ్రనేతలు కళ్లు తెరవడం లేదు.

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలో చేర్చుకొని, ఏరికోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ఓడిపోయి రాష్ట్రంలో పార్టీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని చెడగొట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తానని ప్రగల్భాలు పలికిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన అనంతరం తనదారి తాను చూసుకోవడంతో ఆయనతో బీజేపీకి వచ్చిన ప్రత్యేక లాభం ఏమీ లేకపోగా పార్టీని నమ్ముకున్న నేతలకు మాత్రం మొండిచేయి మిగిలింది. దీంతో గుణపాఠం నేర్వని బీజేపీ అవే తప్పిదాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చేసి నష్టపోయింది.

లోగడ అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు నక్సలిజం భావజాలం ఉందని టికెట్ నిరాకరించిన బీజేపీ ఇప్పుడు అదే భావజాలం గల వారికి రాష్ట్ర పగ్గాలే కట్టబెట్టనుందనే వార్తలు రావడం ఆ పార్టీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. సంఘ్ పరివార్‌లో పనిచేసి బీజేపీకి వచ్చిన వారు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులతో ఇమడలేకపోతున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ సిద్ధాంతాలకే తిలోదకాలిస్తూ అరువు నేతలతో పార్టీని నింపేస్తున్న బీజేపీకి వీరితో ఏమైనా లాభం కలిగిందా అని పరిశీలిస్తే ఆ పార్టీ ఆశించిన ఫలితాలు పొందలేదని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలే నిరూపిస్తున్నాయి.

అంతర్గతంగా పార్టీ పరిస్థితులు ఇలా ఉంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలవడంతో రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో 88 సీట్లు గెలిచి అధికారం చేపడుతామని బీజేపీ అధినేతలు చెబుతున్నారు. వీరి మాటలు ఆకర్షణీయంగా ఉన్నా వాస్తవిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2019లో నాలుగు ఎంపీ స్థానాలు గెలవడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక స్థానాలు పొందడం, రెండు ఉప ఎన్నికల్లో గెలవడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అంటూ ఢంకా భజాయించుకున్న బీజేపీ 8 స్థానాలే పొంది భంగపడింది. ఇప్పుడు 8 ఎంపీ స్థానాలు పొందడంతో 2028లో కాంగ్రెస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటూ మళ్లీ అదే తరహా ప్రచారం మొదలుపెట్టింది.

క్షేత్రస్థాయిలో భిన్న పరిస్థితులు

తెలంగాణలో బీజేపీకి అధికారం చేపట్టేంత పట్టు ఉందా అని క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తే అంత సులభం కాదని వాస్తవ పరిస్థితులు తెలియజేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో మొదటి నుండి పట్టు ఉండడం, ఉత్తర తెలంగాణలో బలపడటంతో బీజేపీ ఆ ప్రాంతాల్లోనే గెలుస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైద్రాబాద్‌లోని ఒక్క గోషామహల్లోనే గెలిచిన బీజేపీ ఉత్తర తెలంగాణలో ఏడు అసెంబ్లీ స్థానాలు గెలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్తోపాటు ఉత్తర తెలంగాణలో కలిపి 8 ఎంపీ స్థానాలు గెలిచింది. రెండు ఎన్నికల్లోనూ బీజేపీ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఒక్క స్థానం కూడా పొందలేదు. ఈ మూడు జిల్లాల పరిధిలో 34 అసెంబ్లీ స్థానాలుండగా దాదాపు అన్ని స్థానాల్లో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉంది.

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సీటు గెలవని బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో మోదీ చరిష్మాతో మూడు ఎంపీ సీట్లను గెలిచింది. అయితే ఈ జిల్లాల పరిధిలో బీజేపీ సంస్థాగతంగా ప్రధానంగా నగర శివార్లలో బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా శాసనసభ ఎన్నికలు వచ్చే సరికి సమీకరణాలు మారుతున్నాయి.

జంటనగరాల్లో సంఘ్ పరివార్ మద్దతుతో బీజేపీ బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఎన్నికల సమయానికి సమిష్టి కృషి లోపిస్తుండడంతో ఒక అసెంబ్లీ, ఎంపీ స్థానానికే పరిమితమైంది. నగరంలో సంఘ్ కార్యకర్తలు బీజేపీ పోకడలతో అంటిముట్టనట్లే ఉంటున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పీపుల్స్ పల్స్ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు ఈ విషయం స్పష్టమైంది. బీజేపీ అభ్యర్థి మాధవిలత సంఘ్ పరివార్ సభ్యులను పట్టించుకోకపోవడంతో వారు దూరంగా ఉన్నారు. దీంతో అసదుద్ధీన్ ఓవైసీకి గతంలో కంటే మెజార్టీ పెరిగింది.

ప్రత్యేక తెలంగాణపై మొట్టమొదటగా బీజేపీ 1997 జులైలో కాకినాడ తీర్మానం చేసినా, 1997 ఆగస్టులో ఏబీవీపీ తీర్మానం చేసినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఉద్యమ ప్రయోజనాలు పొందాయి కానీ, బీజేపీకి మాత్రం ఆ ఫలాలు దక్కలేదు. దీనికి ప్రధాన కారణం ఆ పార్టీ విధానాలను, ఆశయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో బీజేపీ విఫలమవడమే. మరోవైపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కలలుగంటున్న పార్టీలో ఇప్పటికే కేంద్రంలో మంత్రి పదవి రాలేదని కొందరు ఎంపీలలో అసంతృప్తితో రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం కూడా తీవ్ర పోటీ నెలకొనడంతో ఇవి ఎటు దారితీస్తాయో తెలియదు.

ఈ పరిణామాల మధ్య తెలంగాణలో బీజేపీ ప్రకటనలు, వాస్తవ పరిస్థితులను గమనిస్తే వారు ఊహల పల్లకిలో విహరిస్తున్నారని చెప్పవచ్చు. సంస్థాగతంగా బలపడకుండా అధికారంలోకి వస్తామని బీజేపీ భావించడం భ్రమలు మాత్రమే. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ ఊదరగొట్టినా ఆ పార్టీ కంటే సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పని అయిపోయింది, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయమంటూ మళ్లీ అవే రకమైన ప్రకటనలు చేస్తోంది. బీజేపీ కంటే బీఆర్ఎస్‌కు సంస్థాగతంగా కార్యకర్తల బలం ఎక్కువనే వాస్తవాన్ని విస్మరించి కాలయాపన చేస్తే మరోసారి 2023 అసెంబ్లీ ఫలితాలు పునరావృత్తం కావడం ఖాయం.

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ

ఐవీ మురళీకృష్ణ, పీపుల్స్ పల్స్ రీసెర్చర్

(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన అభిప్రాయాలు, వ్యూహాలు, విశ్లేషణలు రచయిత వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)

తదుపరి వ్యాసం