Mahabubnagar MLC Bypoll : ఓటమి తర్వాత బీఆర్ఎస్ కు తొలి విక్టరీ - మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానం కైవసం
Mahabubnagar MLC Bypoll Updates : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి తొలి విజయం దక్కింది. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో విజయం సాధించింది.
Mahabubnagar MLC Bypoll 2024: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ కుమార్ రెడ్డి సుమారు 108 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత… బీఆర్ఎస్ కు దక్కిన తొలి విజయం ఇదే..!
మహబూబ్‌నగర్‌లోని స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. నియోజకవర్గంలో 1,439 మంది ఓటర్లు నమోదు చేసుకోగా… 1,437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులు ఐదు టేబుళ్లలో లెక్కింపును నిర్వహించారు. నాలుగు టేబుళ్లలో ఒక్కొక్కటి 300 ఓట్లను నిర్వహించగా… ఐదవ టేబుల్‌లో మిగిలిన 237 ఓట్లు పోలయ్యాయి.
గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తరపున కసిరెడ్డి నారాయణ గెలిచారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరిన ఆయన… కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు.
స్థానిక సంస్థ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉండడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. మార్చి 28న పోలింగ్ జరిగినప్పటికీ సార్వత్రిక ఎన్నికల కారణంగా కౌంటింగ్‌లో జాప్యం ఏర్పడింది. జూన్ 2వ తేదీన ఫలితాలను ప్రకటించేందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తాజా విజయం బీఆర్ఎస్ పార్టీకి ఉపశమనం ఇచ్చిందని చెప్పొచ్చు. ఓవైపు అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను సాధించి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. మరోవైపు ఇటీవలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం కనిపించటం లేదు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉపఎన్నికలో గెలిచి సిట్టింగ్ స్థానాన్ని నెలబెట్టుకోవటం రిలీఫ్ ఇచ్చే అంశమని చెప్పొచ్చు.
కేటీఆర్ కామెంట్స్…
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలవటంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ విజయం కోసం పని చేసిన ప్రతి ఒక్క పార్టీ నాయకునికి, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు.. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు.
“ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాం. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తాం. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం. అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది. ఆరునెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిది. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటిపార్టీ బీఆర్ఎస్ మాత్రమే” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.