తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dial 100 : కొడుకు స్కూల్ కి వెళ్లడంలేదని, ఇంట్లోకి కుక్క వచ్చిందని- డయల్ 100కు విచిత్రమైన కాల్స్

Dial 100 : కొడుకు స్కూల్ కి వెళ్లడంలేదని, ఇంట్లోకి కుక్క వచ్చిందని- డయల్ 100కు విచిత్రమైన కాల్స్

HT Telugu Desk HT Telugu

18 June 2024, 17:05 IST

google News
    • Dial 100 : డయల్ 100 నొక్కితే క్షణాల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటారు. అయితే ఇటీవల కాలంలో డయల్ 100 మిస్ యూజ్ చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ఓ వ్యక్తి తన కొడుకు స్కూల్ వెళ్లడంలేదని డయల్ 100కి కాల్ చేశాడు.
కొడుకు స్కూల్ కి వెళ్లడంలేదని, ఇంట్లోకి కుక్క వచ్చిందని- డయల్ 100కు కాల్స్
కొడుకు స్కూల్ కి వెళ్లడంలేదని, ఇంట్లోకి కుక్క వచ్చిందని- డయల్ 100కు కాల్స్

కొడుకు స్కూల్ కి వెళ్లడంలేదని, ఇంట్లోకి కుక్క వచ్చిందని- డయల్ 100కు కాల్స్

Dial 100 : కొడుకు తమ మాట వినడం లేదని, స్కూల్ కి వెళ్లమంటే వెళ్లడం లేదని ఓ తండ్రి డయల్ 100 కు కాల్ చేశాడు. మాట వినని తన కొడుకుని సెంట్రల్ జైల్ లో వేయాలని.. అక్కడైనా చదువుకుంటాడని పోలీసులను కోరాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు నివ్వెర పోయారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని విలీన గ్రామమైన పుల్లూరు రామయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి సోమవారం 'డయల్ 100' కు కాల్ చేశాడు. దీంతో లోకల్ పోలీసులు శ్రీనివాస్ కు కాల్ చేయగా.. తన 13 ఏళ్ల కొడుకు స్కూల్ కి సరిగా వెళ్లడం లేదని, గత సంవత్సరం కొంపెల్లి లోని స్కూల్ లో వేస్తే.. కేవలం రెండు నెలలు మాత్రమే వెళ్లాడని చెప్పుకొచ్చాడు. తన కొడుకును సెంట్రల్ జైలు లో వేయాలని, అక్కడైనా చదువుకుంటాడన్నాడు. ఎలాగైనా తన కొడుకు స్కూల్ కి వెళ్లేలా చేయాలని పోలీసులను కోరాడు. దీంతో శ్రీనివాస్ సమాధానం విన్న పోలీసులు నివ్వెర పోయారు. అత్యవసర సమయాల్లో వినియోగించాల్సిన డయల్ 100 సర్వీస్ ను చిన్న చిన్న కారణాలకు ఉపయోగించడం సరికాదని, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు శ్రీనివాస్ ను సున్నితంగా హెచ్చరించారు.

ఇంట్లోకి కుక్క వచ్చిందని మరొకరు

ఆపదలో సాయం కోసం వినియోగించాల్సిన డయల్​ 100 సేవలను సిల్లీసిల్లీ రీజన్స్ కు కూడా ఉపయోగించడం విమర్శలకు తావిస్తోంది. కాగా దాదాపు 20 రోజుల కిందట వరంగల్ గిర్మాజీపేటలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గిర్మాజీపేటకు చెందిన కొండపర్తి రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఇంట్లో రాత్రి 10 గంటల సమయంలో ఓ వీధి కుక్క చొరబడింది. దానిని బయటకు వెళ్ల గొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో కుక్కను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కుక్కను ఇంట్లో నుంచి బయటకు ఎలా వెళ్లగొట్టాలో తెలియక రాజేంద్ర కుమార్ వెంటనే ‘డయల్​100’కు కాల్​ చేశారు. దీంతో సమీపంలోని ఇంతేజార్ గంజ్ పోలీస్​ స్టేషన్​ నుంచి బ్లూకో‌ల్ట్స్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్కడ విషయం తెలుసుకుని ఇద్దరు కానిస్టేబుళ్లు అవాక్కయ్యారు. దీంతో ఇంట్లోకి కుక్క వస్తే కూడా పోలీసులే కావాలా అంటూ సిబ్బంది రాజేంద్ర కుమార్​ ను సున్నితంగా మందలించారు. అనంతరం బ్ల్యూ కోల్ట్​ సిబ్బంది శ్రమించి కుక్కను ఇంట్లో నుంచి తరిమేశారు. కాగా ఎవరికి ఏ ఆపద వచ్చిన డయల్​ 100 సేవలను వినియోగించుకోవచ్చని పోలీసులు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి ఆపద వచ్చినా క్షణాల్లో స్పందించే పోలీస్​ సేవలను చిన్న చిన్న అవసరాలకు కాకుండా అత్యవసర సాయం కోసం మాత్రమే ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసర సేవలకు వినియోగించాల్సిన డయల్ 100 సేవలను మిస్ యూజ్ చేయొద్దని కోరుతున్నారు.

(రిపోర్టింగ్: హిందూస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం