Dial 100 : డయల్ 100 కాల్ చేసి కంప్లేంట్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ ఆనంద్
హైదరాబాద్ పోలీస్ కమిషనర్.. డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. అదేంటి ఆయన ఆర్డర్ వేస్తే.. పోలీసులే పరుగులు పెడతారు కదా అనుకుంటున్నారా? కానీ సామాన్యూడిలా కాల్ చేసి.. పోలీసులకు కంప్లేంట్ ఇచ్చారు.
సామాన్యులకు ఏదైనా ఇబ్బంది కలిగితే.. వెంటనే గుర్తొచ్చే నెంబర్ డయల్ 100. వెంటనే కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇస్తారు. కొంతమంది ఆకతాయిలు కాల్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. డయల్ 100కి కాల్ చేస్తే.. పోలీసులు తప్పకుండా స్పందిస్తారని ఓ నమ్మకం. డయల్ 100 కంట్రోల్ రూమ్ కు శనివారం రాత్రి ఓ ఫోన్ వచ్చింది. మా ఏరియాలో మ్యూజిక్ పెట్టి.. టపాసులు కాలుస్తున్నారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున మ్యూజిక్ ప్లే చేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.
కంట్రోల్ రూమ్‌లోని పోలీసులు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు విషయాన్ని చెప్పారు. పెద్ద ఎత్తున మ్యూజిక్ పెట్టి.. ఇబ్బంది కలిగిస్తున్నారని.. డయల్ 100కు ఫోన్ చేసింది.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అని వారికి తెలియదు. జూబ్లీహిల్స్ పీఎస్ పోలీసులు పెట్రోలింగ్ వాహనాలకు సందేశం వెళ్లింది. విధుల్లో ఉన్న జూబ్లీహిల్స్ సీఐ.. సంఘటనా స్థలానికి వెళ్లి సౌండ్ సిస్టమ్, బ్యాండ్‌ను ఆపారు.
కమిషనర్ ఇంటికి సమీపంలో ఉన్న ఓంనగర్ బస్తీలో తొట్టెల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు చూశారు. కొందరు యువకులు అత్యుత్సాహంతో గట్టిగా డప్పులు వాయిస్తూ టపాసులు పేలుస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ అనే వ్యక్తి అదుపులోకి తీసుకుని అతడిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కాల్ చేసింది.. మా సార్.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ అని తెలుసుకుని.. పోలీసులు షాక్ అయ్యారు.