Stray dogs kills Child in Hyderabad : హైదరాబాద్ నగరంలో మరోసారి వీధి కుక్కలు(Stray dogs) రెచ్చిపోయాయి. గతేడాది వేసవిలోనూ చాలా ప్రాంతాల్లో వీధి కుక్కలు దాడులకు దిగాయి. ఇందులో కొందరు చిన్నారులు చనిపోగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా వేసవి వస్తే ఈ బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కూడా ఇదే తరహా ఘటన వెలుగు చూసింది. రెండున్నరేళ్ల పాపపై దాడి చేయటంతో…ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే….ఛత్తీస్ ఘడ్ నుండి పని కోసం వలస వచ్చిన కుటుంబం జీడిమెట్లలోని గాయత్రి నగరంలో నివాసం ఉంటుంది. తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు(బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ) చేస్తారు. వీరి పిల్లలు వీధి బయట ఆడుకుంటుండగా… రెండు వీధి కుక్కలు దాడికి దిగాయి. పెద్ద పాప వాటి బారి నుంచి తప్పించుకోగా… చిన్నపాప అయిన దీపాలి(రెండున్నరేళ్లు) మాత్రం… కుక్కలకు చిక్కిపోయింది. దాడి చేసి చిన్నారిని తీవ్రంగా గాయపరిచాయి.
చిన్నారిని దీపాలీని ఆసుపత్రికి తరలించగా.. శనివారం రాత్రి ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బాధిత కుటుంబం ఐదు నెలల క్రితమే హైదరాబాద్ కు వచ్చినట్లు పోలీసులుతెలిపారు. వీధి కుక్కల బెడదపై మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వటంతో… వాటిని నియంత్రించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల కిందట కూడా దుండిగల్ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై దాడికి దిగాయి వీధి కుక్కలు. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఇదే ఏరియాలో ఓ మహిళపై కూడా దాడికి దిగాయి.
వేసవి రావటంతో వీధి కుక్కలు దాడి చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.