తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల చేరికకు రామయ్య సన్నిధి నుంచే శ్రీకారం?

CM Revanth Reddy : ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల చేరికకు రామయ్య సన్నిధి నుంచే శ్రీకారం?

HT Telugu Desk HT Telugu

04 March 2024, 22:16 IST

google News
    • : సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 11న ఆయన భద్రాద్రిలో పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనతో ఎమ్మెల్యేల చేరికకు శ్రీకారం చుడతారని ప్రCM Revanth Reddy Bhadradri Tourచారం జరుగుతోంది.
ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి
ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

ఈ నెల 11న భద్రాద్రికి సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Bhadradri Tour : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి పర్యటన ఖరారైంది. ఈనెల 11వ తేదీన సీఎం భద్రాద్రిలో పర్యటించనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన భద్రాద్రి (Bhadradri)రామయ్య పుణ్యక్షేత్రాన్ని కొత్త సీఎం రేవంత్ రెడ్డి సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉండగా భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలో సీఎం పర్యటనకు(CM Revath Reddy Bhadradri Tour ) అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా కూటమి అభ్యర్థి అయిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెంలో ఘన విజయం సాధించారు. ఈ తొమ్మిది స్థానాలు తప్ప భద్రాచలం నియోజకవర్గంలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకటరావు భద్రాచలంలో గెలుపొందగా ఎన్నికల ఫలితాల రోజు నుంచే ఆయన పార్టీ వీడతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

పొంగులేటితో కలిసి సీఎం వద్దకు తెల్లం

భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ను కలవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమైంది. ఇప్పటి వరకు అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిసినప్పటికీ వారు వ్యక్తిగతంగానే వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పుకున్నారు. అయితే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలిసి వెళ్లడమే ఇక్కడ ప్రధాన చర్చకు కారణమైంది. తొలి నుంచి పొంగులేటి మనిషిగా పేరున్న తెల్లం వెంకట్రావు ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు జరిపిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోను పొంగులేటి(Ponguleti Srinivas Reddy) ఆయనను రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా పరిచయం చేశారు. కాగా కాంగ్రెస్ లో భద్రాచలం టికెట్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. అయినప్పటికీ వెంకట్రావుపై పొంగులేటి ముద్ర ఉందని ప్రచారం జోరుగా సాగింది. వ్యూహాత్మకంగానే ఆయన తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్లారన్న ప్రచారమూ జరిగింది.

శ్రీరాముని సాక్షిగా శ్రీకారం చుడతారా?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా మంది బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఇతర కీలక నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వెళుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఏకంగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే వివిధ జిల్లాల్లో మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు వివిధ విభాగాల్లోని ప్రజాప్రతినిధులు సైతం కాంగ్రెస్ పార్టీలో విరివిగా చేరుతున్నారు. అయితే ఇప్పటి వరకు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలకు టచ్ లో ఉన్నారన్న ప్రచారం జరుగుతుండగా ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు చేరలేదు. కాగా తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బట్టి ఎమ్మెల్యేల చేరికకు ముహూర్తం పెట్టారా? అన్న సందేహానికి బలం చేకూరుతున్నట్లు కనిపిస్తోంది. గత ముఖ్యమంత్రి నిర్లక్ష్యం చేసిన భద్రాచలం శ్రీ రామచంద్రుని సాక్షిగానే ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టబోతుందా? అన్న ప్రచారం జరుగుతోంది. 11వ తేదీన భద్రాచలంలో కాలుమోపనున్న సీఎం రేవంత్ రెడ్డి శ్రీరామచంద్రుని దర్శనం అనంతరం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడంతో పాటు పార్టీ పరమైన సమావేశంలోనూ పాల్గొననున్నారు. కాగా ఈ సమావేశంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న ప్రచారం జోరందుకుంది. పొంగులేటితో కలిసి సీఎంను కలిసిన కొద్ది రోజుల వ్యవధిలోనే భద్రాచలం(Bhadrachalam)లో సీఎం పర్యటన ఖరారు కావడం వెనుక పెద్ద ప్రణాళికే దాగి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే జరిగితే భద్రాద్రి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Tellam Venkatrao) కాంగ్రెస్ లో చేరే తొలి ఎమ్మెల్యే కానున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం

తదుపరి వ్యాసం