Bhadrachalam Godavari : భద్రాద్రి వద్ద శాంతిస్తున్న గోదారమ్మ, 51.2 అడుగుల వద్ద నిలకడగా వరద ప్రవాహం
23 July 2024, 14:45 IST
- Bhadrachalam Godavari : భద్రాచలం వద్ద గోదావరి కాస్త శాంతించింది. ఇవాళ ఉదయం 51.6 అడుగులకు చేరిన వరద ప్రవాహం... మధ్యాహ్నం ఒంటి గంటకు 51.2 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా...వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు.
భద్రాద్రి వద్ద శాంతిస్తున్న గోదారమ్మ, 51.2 అడుగుల వద్ద నిలకడగా వరద ప్రవాహం
Bhadrachalam Godavari : రెండ్రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ ఉగ్ర రూపం చూపించిన వరద గోదావరి శాంతిస్తున్నట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి వరద ప్రవాహం ఆ తర్వాత స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. 11 గంటల సమయంలో 51.4 అడుగులకు తగ్గింది. మధ్యాహ్నం ఒంటి గంటకు 51.2 అడుగులకు చేరుకుని నిలకడగా సాగుతోంది. సీడబ్ల్యూసీ అధికారిక గణాంకాల ఆధారంగా గోదావరి వరద ఇంకొంత స్వల్పంగా తగ్గి 50 అడుగుల మేర ప్రవహించే అవకాశం ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చేది. కాగా తాజాగా గోదావరి ఉద్ధృతి తగ్గి నిలకడగా ప్రవహిస్తుండటం ఊపిరి పీల్చుకోదగిన పరిణామంగా కనిపిస్తుంది.
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ లలో వర్షాలు తగ్గినప్పటికీ నేటి ఉదయం వరకు గోదావరి వరద ఉద్ధృతి తగ్గకపోవడం గమనార్హం. మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వస్తే ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలన్నీ అధికారులు తీసుకున్నారు. ఇందులో భాగంగా గోదావరి వరదల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా నదీ పరివాహక ప్రాంత వాసులకు సేవలందిస్తున్న ఎన్టీఆర్ఎఫ్ బృందం ఈ ఏడాది సైతం తమ సేవలను అందించేందుకు ఇప్పటికే భద్రాద్రి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాకు చెందిన 10వ ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కు చెందిన ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ నేతృత్వంలో 34 మంది సభ్యుల బృందం భద్రాచలంలో అత్యవసర సమయంలో సేవలందించేందుకు సిద్ధంగా ఉంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని చర్ల, దుమ్ముగూడెం మండలాల ముంపు ప్రాంతాల ప్రజలు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఫ్లడ్ డ్యూటీ అధికారులకు సహకరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
భద్రాచలంతో తెగిపోయిన సంబంధాలు
భద్రాచలంతో చుట్టుపక్కల మండలాలకు సంబంధాలు తెగిపోయాయి. చింతూరు, కూనవరం తదితర ముంపు మండలాలకు భద్రాద్రితో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఇదే రహదారిని కుంటా, జగదల్పూర్ వెళ్లేందుకు ఉపయోగిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతాలకు వెళ్లే వీలు లేకుండా పోయింది. భద్రాచలం ఏజెన్సీ వ్యాప్తంగా రాకపోకలు స్తంభించిపోయాయి. భద్రాచలం నుంచి చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే రహదారిపైకి వరద నీరు చేరింది. తూరుబాక బ్రిడ్జి వద్దకు సైతం వరద నీరు చేరింది. ముందస్తు చర్యలలో భాగంగా అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం మొండికుంట నుంచి ఇరవెండి వెళ్ళే ప్రధాన రహదారి పై రామచంద్రాపురం స్టేజీ (కడియాల బుడ్డి వాగు) వద్ద రహదారి పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మొత్తంమీద రెండ్రోజులుగా ఎగసి పడిన గోదావరి ప్రవాహం ప్రస్తుతం నిలకడగా సాగుతుండటంతో అధికారులతో పాటు ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్షాలు తగ్గడంతో వరద ప్రవాహం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.