తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Godavari Floods: భద్రాచలం, ధవళేశ్వరంలో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు, పోలవరంలో గోదావరి ఉగ్ర రూపం

Godavari Floods: భద్రాచలం, ధవళేశ్వరంలో రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు, పోలవరంలో గోదావరి ఉగ్ర రూపం

Sarath chandra.B HT Telugu

23 July 2024, 6:12 IST

google News
    • Godavari Floods: గోదావరి మహోగ్ర రూపం సంతరించుకుంది. మంగళవారం తెల్లవారుజామున భద్రాచలం, ధవళేశ్వరంలలో  రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. పోలవరం స్పిల్‌వే వద్ద ఉదయం ఆరు గంటలకు 11.80లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.  ఇది మరింత పెరుగనుంది. 
పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌ వద్ద గోదావరి పరవళ్లు...
పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌ వద్ద గోదావరి పరవళ్లు...

పోలవరం ప్రాజెక్టు స్పిల్ ఛానల్‌ వద్ద గోదావరి పరవళ్లు...

Godavari Floods: గోదావరి ఉగ్రరూపం సంతరించుకుంది. ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం నుంచి ధవళేశ్వరం వరకు ప్రళయగోదావరిని తలపిస్తోంది. సోమవారం అర్థరాత్రి నుంచి గోదావరి ప్రవాహం అంతకంతకు పెరుగుతూనే ఉంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ధవళేశ్వరం వద్ద ఆదివారం అర్థరాత్రి 12గంటలకు గోదావరి నీటి మట్టం 13.60 అడుగులకు చేరింది. ఆ సమయంలో ధవళేశ్వరం ఆనకట్ట నుంచి సముద్రంలోకి 12.68లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని విడుదల చేశారు. ఒంటి గంటకు 12.71లక్షల క్యూసెక్కులు, రెండు గంటలకు 13.75లక్షల క్యూసెక్కులు, మూడు గంటలకు 13.80లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరింది. పోలవరం స్పిల్ వే వద్ద ఉదయం ఆరు గంటలకు 11.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.

తెల్లవారుజామున రెండు గంటల సమయంలో గోదావరికి రెండో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువన భద్రాచలంలో కూడా గోదావరి నీటి మట్టం 50అడుగులకు చేరువలో ఉంది. దీంతో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయగా, మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి పరవళ్లు తొక్కు తోంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద ఉధృతి పెరిగింది.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాల ప్రభావంతో గోదావరి వరద ఉధృతి ధవళేశ్వరం వద్ద పెరుగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. సోమవారం వారం రాత్రి 7 గంటల నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరిగింది. రెండవ ప్రమాద హెచ్చరిక వలన ప్రభావితమయ్యే జిల్లాల్లోని గ్రామాల వరకు క్షేత్రస్థాయిలో ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.

విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ సంబంధిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అత్యవసర సహాయక చర్యలకోసం 4 NDRF, 6 SDRF మొత్తం 10 బృందాలు ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి తెలిపారు.

ప్రజల ఫోన్లకు వరద హెచ్చరిక, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సందేశాలు పంపుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసర సహాయం, కోసం 24 గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 1070,112, 1800 425 0101 సంప్రదించాలన్నారు.

పోలవరం ముంపు మండలాల్లోనే అధిక ప్రభావం..

గోదావరిలో వరద ఉదృతితో తెలంగాణ, ఏపీల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. భద్రాచలం నుంచి కోనసీమ జిల్లా వరకూ నదికి ఇరువైపులా గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. భద్రాచలం వద్ద సోమవారం మద్యాహ్నం నుంచి రెండో నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 50 అడుగులకు చేరువలో ఉంది.

గోదావరి, శబరి నదుల వరదలతో అల్లూరి సీతారామరాజు జిల్లా లోని విలీన మండలాల్లో ప్రజలు విలవిల్లాడుతున్నారు. చింతూరు మండలం చట్టి వద్ద జాతీయ రహదారి-30పై, నిమ్మలగూడెంకుయి గూరు గ్రామాల మధ్య 326వ నంబరు హైవేపై వరద నీరు ప్రవహిస్తోంది. వరదలతో ఈ మార్గంలో 4 రోజులుగా ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్‌ఘఢ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపో యాయి.

చింతూరు- వరరామచంద్రాపురం మండలాల మధ్య ప్రధాన రహదారిపై సోకులేరు, చీకటివాగుల వద్ద వరద నీరు చేరి చేరడంతో వారం రోజులుగా ఏజెన్సీ గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. విలీన మండలాల్లోని ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి కొండలపై చేరుతున్నారు. మండలానికి ఒక ఐఏఎస్ అధికారి బాధ్యులుగా ఉంటారని నిర్వాసితులకు కలెక్టర్ హామీ ఇచ్చారు.

పోలవరం కాఫర్‌ డ్యామ్‌ను తాకేలా వరద…

గోదావరి వరదలతో పోలవరం డ్యామ్‌ వద్ద ప్రవాహం భారీగా పెరిగింది. డ్యాం ఎగువన కాఫర్‌ డ్యామ్‌ మీద మళ్లించిన వరద ప్రవాహం స్పిల్‌ ఛానల్‌ వైపు ప్రవహిస్తోంది. రాతి డ్యామ్‌ నిర్మించాల్సిన ప్రాంతానికి ఎగువన భారీగా వరద చేరింది. ఎగువ-దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీరు భారీగా చేరుతోంది.

రెండు కాఫర్ డ్యాం( మట్టి కట్టలు)ల మధ్య 21.01 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ఇటీవల జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడి ఆదేశాలతో దిగువ కాఫర్ డ్యాం కుడివై పున సీపేజీ బయటకు పోయేందుకు, యుద్ధప్రాతిపదికన స్లూయిజ్ గేట్లు అమర్చారు. మరోవైపు గోదావరి వరదలతో పోలవరం ప్రాజెక్టుకు రాకపోకలు సాగించే ప్రధానరోడ్డు మార్గం ప్రమాద స్థాయిలో కోతకు గురైంది. రోడ్డులో సగం కూలి పోయింది. వరద ప్రవాహం మరింత పెరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది.

తదుపరి వ్యాసం