తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ganesh Chaturthi 2024: గణేశ్ నవరాత్రి దీక్షలు చేపట్టండి.. మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా చెల్లిస్తా: బండి సంజయ్

Ganesh Chaturthi 2024: గణేశ్ నవరాత్రి దీక్షలు చేపట్టండి.. మండపాలకయ్యే కరెంట్ ఖర్చంతా చెల్లిస్తా: బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

31 August 2024, 22:38 IST

google News
    • Ganesh Chaturthi 2024: వినాయక చవిత ఉత్సవాలను నిర్వహించే వారు.. తప్పనిసరిగా 9 రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టాలని.. కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. భక్తి శ్రద్దలతో పూజిస్తే కోరికలు నెరవేరుతాయని.. అందుకు తానే ఉదాహరణ అని స్పష్టం చేశారు. గణేష్ మండపాలకయ్యే కరెంట్ ఖర్చు భరిస్తానని చెప్పారు.
సమీక్ష సమావేశంలో బండి సంజయ్
సమీక్ష సమావేశంలో బండి సంజయ్

సమీక్ష సమావేశంలో బండి సంజయ్

కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో.. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించుకోవాలి. అందుకు పోలీసులు, అధికారులు పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించి.. కరీంనగర్‌ను ఆదర్శంగా నిలుపుదాం. హిందూ సమాజంపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించే వాళ్లంతా తప్పనిసరిగా 9 రోజులపాటు ఉపవాస దీక్షలు తీసుకోవాలని కోరుతున్నా. ఎందుకంటే భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్ష చేపడితే.. కోరికలు నెరవేరుతాయి' అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

'గణేష్ మండపాల వద్ద నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరుతున్నా. మండపాల వద్ద కరెంట్ సౌకర్యం కల్పించే విషయంలో.. విద్యుత్ శాఖ అధికారులు మండప నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టొదు. గణేష్ మండపాల నిర్వహణకు అయ్యే విద్యుత్ ఛార్జీలన్నీ నేను చెల్లస్తా. దయచేసి మండప నిర్వాహకులను బిల్లులు అడగొద్దు. ఈరోజు నుండే కరెంట్‌కు ఇబ్బంది లేకుండా.. గణేశ్ విగ్రహాలు తీసుకొచ్చే సమయంలో తీగలు అడ్డు ఉండకుండా చర్యలు తీసుకోవాలి' అని బండి సంజయ్ సూచించారు.

కొత్తపల్లి బ్రిడ్జిని ప్రారంభించిన బండి..

కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లిలో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని బండి సంజయ్ ప్రారంభించారు. రూ.2.65 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ బ్రిడ్జి వల్ల.. కొత్తపల్లి, మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంటతోపాటు కరీంనగర్ నగర ప్రజలకు ఎంతో ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా ఈ బ్రిడ్జీపై రాకపోకలు సాగించే సుమారు 28 వేల మంది రైతులకు, మత్స్యకారులకు ప్రయోజనం కలుగుతుంది. అటు కరీంనగర్ కాపువాడలో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హలు భవన నిర్మాణ పనులకు బండి సంజయ్ భూమి పూజ చేశారు. ఈ భవన నిర్మాణానికి రూ.15 లక్షల ఎంఫీ లాడ్స్ నిధులను మంజూరు చేశారు. పెద్దమ్మ కాలనీలో రూ.10 లక్షల ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించనున్న వడ్డెర కమ్యూనిటీ హాలు, హస్నాపూర్ కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు.

మిస్డ్ కాల్ ఇవ్వండి..

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయించాలని.. బండి సంజయ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కరీంనగర్ చైతన్యపురిలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో 'నా బూత్.. నా కార్యశాల సభ్యత్వ నమోదు (174 పోలింగ్ బూత్)' కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ పోలింగ్ బూత్‌ల పరిధితలో అత్యధికంగా పార్టీ సభ్యత్వం నమోదు చేయించేలా కృషి చేయాలని కోరారు. బీజేపీ సభ్యత్వం కావాలనుకునే వాళ్లంతా 8800002024 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచించారు.

(రిపోర్టింగ్- కెవి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్