Hydra: అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలి.. హైడ్రాపై బండి సంజయ్ కీలక కామెంట్స్-union minister bandi sanjay sensational comments on hydra ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra: అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలి.. హైడ్రాపై బండి సంజయ్ కీలక కామెంట్స్

Hydra: అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలి.. హైడ్రాపై బండి సంజయ్ కీలక కామెంట్స్

Basani Shiva Kumar HT Telugu
Aug 30, 2024 01:30 PM IST

Hydra: హైడ్రాపై రాజకీయ నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు హైడ్రాను సపోర్ట్ చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు హైడ్రాపై ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రా తీరుపై విమర్శలు చేశారు. కక్ష సాధింపు చర్యల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి బండి సంజయ్
కేంద్రమంత్రి బండి సంజయ్

హైడ్రా కూల్చివేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సెటైర్లు వేశారు. హైడ్రా చర్యలు కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆరోపించారు. అన్ని ఆక్రమణల విషయంలో ఒకేలా వ్యవహరించడం లేదన్న బండి.. సల్కం చెరువులో ఆక్రమణలను ఎందుకు కూల్చడంలేదని ప్రశ్నించారు. ఒవైసీ కాలేజీకి మాత్రం ఏడాది సమయం ఎందుకిచ్చారని నిలదీశారు. అందరికీ ఒకే న్యాయమైతే.. ఒవైసీ కాలేజీని కూల్చాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.

ఘాటుగా స్పందించిన రంగనాథ్..

హైడ్రాపై పొలిటికల్ కామెంట్స్ పెరుగుతున్న సమయంలో.. కమిషనర్ ఏవీ రంగనాథ్ కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇటీవల ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా రాజకీయాలకు పావుగా మారదలుచుకోలేదని స్పష్టం చేశారు. ఒవైసీ, మల్లారెడ్డి అని వ్యక్తులను చూడబోమని చెప్పారు. కాలేజీ కాబట్టి విద్యార్థుల భవిష్యత్‌ గురించి ఆలోచిస్తామని వివరించారు. చెరువులను ఆక్రమించి కాలేజీలు నిర్మించడం వాళ్ల పొరపాటు రంగనాథ్ స్పష్టం చేశారు.

హైడ్రా నోటీసులు ఇవ్వబోదు..

చెరువుల పరిరక్షణ ముఖ్యమైన అంశమే కానీ.. దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ఇంకా ముఖ్యమని ఏవీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వారికి తగిన సమయం ఇస్తామని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా హైడ్రా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఉంటే ధర్మసత్రాలైనా కూల్చివేస్తామని తేల్చి చెప్పారు. హైడ్రా నోటీసులు ఇవ్వబోదని.. డైరెక్ట్‌గా కూల్చివేయడమేనని స్పష్టం చేశారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా.. పలు చెరువులు, పార్కుల ఆక్రమణలపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

నెక్ట్స్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్..

మరోవైపు.. అక్రమ కట్టడాల కూల్చివేతపై హైడ్రా స్పీడ్ పెంచింది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాళాలపై నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేస్తున్నారు. ఇటీవలే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రా కూల్చివేసింది. తాజాగా.. ఇరిగేషన్ అధికారులు జన్వాడ ఫామ్ హౌస్కు వద్ద కొలతలు వేయడంతో హైడ్రా నెక్ట్స్ టార్గెట్ జన్వాడ ఫామ్ హౌస్ అని తెలుస్తోంది.

ఏవీ రంగనాథ్‌‌కు ముప్పు..

హైప్రొఫైల్ వ్యక్తుల అక్రమ భవనాలను కూల్చివేస్తుండడంతో.. హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌‌కు ముప్పు ఉందని తెలంగాణ సర్కార్ ఆయనకు భద్రత పెంచింది. రంగానాథ్ ఇంటి దగ్గర పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఆయన ఇంటి వద్ద ఇద్దరు సెక్యూరిటీతో పోలీస్ ఔట్‌ పోస్టు ఏర్పాటు చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో ఏవీ రంగనాథ్‌కు ఏమైనా ముప్పు వాటిళ్లవచ్చన్న అనుమానంతో.. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది.